Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’

  • భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం
  • ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం
Indian Pilot Smit Machhar

Indian Pilot Smit Machhar

Indian Flydubai captain Smit Machhar: భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ అసాధారణ ధైర్యసాహసానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో తన సహ పైలట్ దాడిని ఎదుర్కొంటూ 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడినందుకు ఆయనకు ఇజ్రాయెల్‌ అత్యున్నత పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ అందజేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడినా విధి నిర్వహణలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన స్మిత్ మచ్చర్‌ త్వరగా కోలుకోవాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఆకాంక్షించారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత పురస్కారాన్ని అందజేస్తామని ప్రకటించారు.

కాక్‌పిట్‌లో సహ పైలట్ దాడి

అందించిన వివరాల ప్రకారం, ఫ్లైదుబాయ్ విమానంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై ఆయన సహ పైలట్, ఒమన్‌కు చెందిన హమ్మామ్ అల్-హమ్మామీ దాడి చేశాడు. కాక్‌పిట్‌లో క్రాష్ యాక్స్‌తో దాడి చేయడంతో స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన గాయాలు, అధిక రక్తస్రావం ఉన్నప్పటికీ ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. కాక్‌పిట్ తలుపును తెరవడంతో విమానంలోని ఇజ్రాయెల్ ప్రయాణికులు లోపలికి ప్రవేశించి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారు. ఈ ఘటనలో పైలట్ ప్రదర్శించిన ధైర్యం వల్ల విమానంలోని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.

యూఏఈ ఆసుపత్రిలో చికిత్స

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్‌ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయాల తీవ్రత ఉన్నప్పటికీ, సంక్షోభ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం, వృత్తిపరమైన నైపుణ్యం ఎంతో కీలకంగా నిలిచాయని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రశంసించారు.