NTV Telugu Site icon

PM Modi: “యుద్ధాన్ని ఆపేందుకు సాధ్యమైనదంతా చేస్తాం”.. ఉక్రెయిన్‌కు ప్రధాని హామీ..

Modi, Zelenskyy

Modi, Zelenskyy

PM Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో సమావేశం అయ్యారు. శనివారం జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. అంతకుముందు మోడీ, జెలెన్ స్కీ టెలిఫోన్లలో మాత్రమే సంభాషించారు.

Read Also: MK Stalin: కర్ణాటక ఓటమిని కప్పిపుచ్చడానికే రూ.2000 నోట్ల రద్దు..

ఈ సమావేశంలో యుద్ధం గురించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్‌లో యుద్ధం మొత్తం ప్రపంచానికి పెద్ద సమస్య. ఇది ప్రపంచాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది, కానీ నేను దానిని రాజకీయ లేదా ఆర్థిక సమస్యగా పరిగణించను. ఇది నాకు, మానవత్వం మరియు మానవ విలువలకు సంబంధించిన సమస్య. యుద్ధ బాధలు మా అందరికంటే మీకు బాగా తెలుసు.గత సంవత్సరం మా పిల్లలు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చి అక్కడి పరిస్థితులను వివరించినప్పుడు, మీ పౌరుల వేదనను నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఈ పరిస్థితులను పరిష్కరించడానికి భారతదేశం, నేను వ్యక్తిగతంగా సాధ్యమైనదంతా చేస్తాం’’ అని ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి హామీ ఇచ్చారు.

గతేడాది ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత ఉక్రెయిన్ లో చదువుకుంటున్న భారతీయులను ‘ఆపరేషన్ గంగా’ ద్వారా ఇండియాకు క్షేమంగా తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ప్రధాని మోడీ ఇటు జెలెన్ స్కీతో, అటు పుతిన్ తో సంభాషించారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ స్పష్టం చేసింది. గత నెలలో ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా భారత్ పర్యటించారు. భారత్ సాయాన్ని అభ్యర్థించారు.