ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్థాన్.. ‘ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంద’ని భారత్ మండిపడింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్ వల్ల.. మొత్తం ప్రపంచం ఇబ్బందులు పడుతోందని భారత్ స్పష్టంచేసింది. తనవైపు ఇన్ని తప్పులు పెట్టుకొని అంతర్జాతీయ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ పదునైన వ్యాఖ్యలతో పాకిస్థాన్‌కు దిమ్మతిరిగిపోయే బదులిచ్చారు మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన స్నేహా ఐరాసలో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు అంశాన్ని లేవనెత్తారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. ఓ అంతర్జాతీయ వేదికపై అవాస్తవాలతో విషం చిమ్మేందుకు పాక్ ప్రయత్నిస్తోందని.. అందుకే నిజాల్ని ప్రపంచం ముందుంచాలనుకుంటున్నాం అంటూ స్నేహా దూబే స్పష్టంచేశారు.పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన స్నేహా దూబేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సివిల్స్ పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌గా ఎంపికయ్యారు స్నేహా. 2012 బ్యాచ్‌కు చెందిన దూబే మొదటి పోస్టింగ్ విదేశాంగ శాఖలో. ఆ తర్వాత 2014లో స్పెయిన్‌లోని భారత దౌత్యకార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఈ ప్రసంగం వెలుగులోకి రాగానే.. సోషల్ మీడియాలో స్నేహాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పాక్ నోరు మూయించారు. ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఉపయోగించారు.. అంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు.
