Russi-Ukraine War: ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడి చేయకుండా రష్యాను భారత్, చైనా అడ్డుకుని ఉండవచ్చని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ అణు ఆయుధాలు వాడకుండా భారత్, చైనా దేశాలే నిరోధించి ఉండవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యాపై ఈ రెండు దేశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపాయని అన్నారు. జీ 20 సమ్మిట్ కోసం భారతదేశానికి వచ్చే కొన్ని రోజులముందు బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Hong Kong: హాంకాంగ్ మోడల్ దారుణ హత్య.. ఫ్రిజ్ లో కాళ్లు.. ఇంకా దొరకని తల
భారత్, రష్యాల మధ్య దశాబ్ధాలుగా బంధం ఉందని, అయితే ఇప్పుడు భారత్, యూఎస్ఏ సంబంధాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. దశాబ్ధాలుగా ఇండియా తన సైనిక అవసరాల కోసం రష్యాపై ఆధారపడి ఉంది. అయితే గత కొంత కాలంగా అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలతో భారత్ భాగస్వామ్యం బలపడుతోందని అన్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఇండియా, చైనాలు తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయి. శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రష్యా యుద్ధాన్ని ముగించాలని తీర్మానం చేశారు. అయితే దీనికి కూడా ఇరు దేశాలు గైర్హాజరు అయ్యాయి. మొత్తం 193 దేశాలు ఉన్న జనరల్ అసెంబ్లీలో 141 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేయగా, ఏడు దేశాలు వ్యతిరేకించాయి. భారత్, చైనాలతో పాటు 32 దేశాలు గైర్హాజరు అయ్యాయి. ఉక్రెయి, రష్యాలు సమస్యను శాంతియుతంగా దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలని భారత్ సూచిస్తోంది.