Site icon NTV Telugu

A Rare Heist: ఇదెక్కడి దొంగతనం.. ల్యాప్‌టాప్, టీవీల కోసం 133 టన్నుల చికెన్ దొంగిలించారు..

Cuba

Cuba

A Rare Heist: ఆర్థిక సంక్షోభం, పేదరికం, నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న క్యూబా దేశంలో అరుదైన దొంగతనం జరిగింది. ఆహార కొరత ఉన్న ఆ దేశంలో దొంగలు ఏకంగా 133 టన్నుల చికెన్ దొంగలించారు. దీనంతటిని విక్రయించి వచ్చిన డబ్బుతో ల్యాప్‌టాప్, టీవీలు, రిఫ్రిజ్‌రేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేశారు. ఈ దొంగతనంలో 30 మందిపై అభియోగాలు మోపారు. దేశ రాజధాని హవానాలో ఈ దొంగతనం జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

Read Also: Shiv Sena MLA: “మీ పేరెంట్స్ నాకు ఓటేయకుంటే రెండు రోజులు తినకండి”.. పిల్లలతో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

హవానాలోని స్టేట్ ఫెసిటిలీ సెంటర్ నుంచి 1660 తెల్లని బాక్సుల్లో చికెన్ దొంగిలించి తీసుకెళ్లారు. కమ్యూనిస్ట్ క్యూబా దేశంలో రేషన్ ప్రకారం ఈ మాంసాన్ని ప్రజలకు ఇవ్వాల్సి ఉంది. దీన్నే దొంగలు దొంగిలిచినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పంపిణీదారు COPMAR డైరెక్టర్ రిగోబెర్టో ముస్టెలియర్ మాట్లాడుతూ.. దొంగిలించబడిన చికెన్ ఒక ప్రావిన్స్ నెల రోజుల రేషన్ చికెన్‌కి సమానమని చెప్పారు.

చికెన్ దొంగతనానికి సంబంధించి ఖచ్చితమైన సమయాన్ని పేర్కొనపోయినప్పటికీ.. అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య కోల్డ్ స్టోరేజి సదుపాయంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల్ని గమనించినట్లు, సీసీటీవీ ఫుటేజీలో చికెన్ నిల్వ స్థావరం నుంచి ట్రక్కుల్లో తీసుకెళ్తున్నట్లు రికార్డైంది. అభియోగాలు మోపబడిన 30 మందిలో ప్లాంట్ లోని షిఫ్ట్ అధికారులు, ఐటీ ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులు, కంపెనీలతో నేరుగా సంబంధం లేని బయటి వ్యక్తులు కూడా దొంగతనంలో పాల్గొన్నట్లు తేలింది. నిందితులు దోషులుగా తేలితే 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత క్యూబా దేశంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ఆ దేశంలో దొంగతనాలు పెరిగాయి.

Exit mobile version