Site icon NTV Telugu

Imran Khan Arrest: రణరంగంగా పాకిస్తాన్.. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు, ఆర్మీ విఫలయత్నం..

Pak

Pak

Imran Khan Arrest: పాకిస్తాన్ రణరంగంగా మారుతోంది. సివిల్ వార్ దిశగా పాకిస్తాన్ వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి ఆర్మీ, పోలీసులను ఇమ్రాన్ మద్దతుదారులు సవాల్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు లాహోర్ లోని జమాన్ పార్క్ వద్ద ఉన్న ఆయన నివాసానికి పంజాబ్ పోలీసులు చేరుకున్నారు. అయితే పీటీఐ, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అరెస్ట్ చేయకుండా పోలీసులకు అడ్డుగా నిలుస్తున్నారు.

Read Also: Boora Narsaiah: తెలంగాణలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో..

తాజాగా బుధవారం ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. మంగళవారం నుంచి 24 గంటలుగా ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇమ్రాన్ మద్దతుదారుల నుంచి పోలీసులకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పీటీఐ మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు. అక్కడే గుమిగూడిన ప్రజలపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు పాకిస్తాన్ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ మొత్తం ఘర్షణల్లో ఇస్లామాబాద్ డీఐజీ ఆపరేషన్స్ షాజామ్ నదీమ్ బుఖారీతో పాటు 54 మంది పోలీసులు గాయపడ్డారు.

మరోవైపు పాక్ పోలీసులతో పాటు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పాక్ ఆర్మీ కూడా రంగంలో దిగినట్లు తెలుస్తోంది. అయితే జమాన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో లాహోర్ హైకోర్టు రేపు ఉదయం 10 గంటల వరకు ఆ ప్రాంతంలో పోలీస్ చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. అయితే మంగళవారం పాక్ ప్రజలు, పీటీఐ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. తనను అరెస్ట్ చేసి చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని, నేను పాక్ ప్రజల కోసం పోరాడుతున్నా అని అన్నారు. నేను చనిపోయినా, అరెస్ట్ అయినా ఉద్యమాన్ని ఆపొద్దని సూచించాడు.

Exit mobile version