Imran Khan Release Protest: పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం మరోసారి భారీ స్థాయిలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ PTI కార్యకర్తలు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా నుంచి ఇస్లామాబాద్ వైపు భారీ లాంగ్ మార్చ్ చేపట్టారు. ప్రభుత్వం, PTI నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమైన తర్వాత ఈ మార్చ్ ప్రారంభమైంది.
నిరసనల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. నగరంలోకి నిరసనకారులు ప్రవేశించకుండా భద్రతను భారీగా పెంచారు. పార్లమెంట్ పరిసరాలు, ప్రధాన రహదారులను కంటైనర్లతో మూసివేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల మార్చ్ ఇస్లామాబాద్‌కు చేరుతుందా? లేక ప్రభుత్వం మార్గమధ్యంలోనే అడ్డుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
రెండు దఫాల చర్చలు.. అయినా కుదరని ఒప్పందం
ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య సమస్య పరిష్కారం కోసం రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. రెండో దశ చర్చలు శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రంతా కొనసాగాయి. అయితే ఆదివారం తెల్లవారుజామున ఎలాంటి అంగీకారం లేకుండానే చర్చలు ముగిశాయి. చర్చలు విఫలం కావడంతో PTI తన లాంగ్ మార్చ్‌ను కొనసాగించాలని నిర్ణయించింది.
2 వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారన్న PTI
ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోని లక్కీ మార్వత్ నుంచి PTI మద్దతుదారులు లాంగ్ మార్చ్ ప్రారంభించారు. అక్టోబర్ 4న పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాండీ చౌక్ వద్దకు చేరుకుని మార్చ్‌లో పాల్గొన్నారు. ఇస్లామాబాద్‌కు సుమారు 275 కిలోమీటర్ల దూరం నుంచి వేలాది మంది కార్యకర్తలు రాజధాని వైపు కదులుతున్నారు. ఇదే సమయంలో PTI కార్యకర్తలపై భారీగా అరెస్టులు జరుగుతున్నాయని పార్టీ ఆరోపించింది. దాదాపు 2 వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు PTI వెల్లడించింది. మరోవైపు ఇస్లామాబాద్‌లో పార్లమెంట్, ప్రధాన హైవేలు, కీలక మార్గాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పలుచోట్ల రహదారులను కంటైనర్లతో మూసివేశారు.
సెప్టెంబర్ 27న జరగాల్సిన మార్చ్.. అక్టోబర్ 4కు వాయిదా
PTI తొలుత సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్‌కు లాంగ్ మార్చ్ నిర్వహించాలని ప్రకటించింది. అయితే నిరసనలను అడ్డుకునేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టడంతో మార్చ్‌ను అక్టోబర్ 4కు వాయిదా వేశారు. ఈ పరిణామాల కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడిందని సమాచారం. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను తమ పార్టీ నేతలు కలిసేందుకు అనుమతించాలని PTI డిమాండ్ చేస్తోంది. అలాగే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ప్రైవేట్ వైద్యులను అనుమతించాలని కోరుతోంది.
ఇమ్రాన్ మద్దతుదారుల మార్చ్ రూట్ ఇదే
PTI ప్రకటించిన ప్రణాళిక ప్రకారం లాంగ్ మార్చ్ వివిధ ప్రాంతాల మీదుగా ఇస్లామాబాద్ వైపు కొనసాగనుంది.
అక్టోబర్ 4: కరాక్ సమీపంలో రాత్రి బస.
అక్టోబర్ 5: మధ్యాహ్నం 12:30 గంటలకు కరాక్ నుంచి బయలుదేరి కోహాట్ సమీపంలో రాత్రి బస.
అక్టోబర్ 6: మధ్యాహ్నం 12 గంటలకు కోహాట్, హంగూ, కుర్రం, ఒరక్‌జై ప్రాంతాల నుంచి వచ్చిన నిరసనకారులు మార్చ్‌లో చేరనున్నారు. అనంతరం పెషావర్ వైపు కదిలి మత్తాని సమీపంలో రాత్రి బస చేయనున్నారు.
అక్టోబర్ 7: మధ్యాహ్నం పెషావర్‌లోని బుధ్ బైర్ నుంచి కాఫిలా బయలుదేరుతుంది. పెషావర్‌లోని ఇతర ప్రాంతాల ప్రజలు కోహాట్ రోడ్ బ్రిడ్జ్, మోటర్‌వే టోల్ ప్లాజా వద్ద మార్చ్‌లో చేరనున్నారు. రాత్రికి చర్సద్దా ఇంటర్‌చేంజ్ సమీపంలో బస చేయనున్నారు.
అక్టోబర్ 8: మధ్యాహ్నం 12:30 గంటలకు చర్సద్దా, మొహ్మంద్ ప్రాంతాల నుంచి ప్రజలు కాఫిలాలో చేరనున్నారు.
2023 నుంచి జైలులోనే ఇమ్రాన్ ఖాన్
73 ఏళ్ల మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉన్నారు. అవినీతి, హింసను ప్రేరేపించడం తదితర ఆరోపణలకు సంబంధించి ఆయనపై 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని అదియాలా జైలులో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయన కంటి చూపు సమస్యపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో, ఆగస్టు 18న పాకిస్థాన్ సుప్రీంకోర్టు పరీక్షలు, చికిత్స కోసం ఆయనను ఇస్లామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించినట్లు సమాచారం.
అయితే ప్రభుత్వం ఈ ఆదేశాన్ని సవాలు చేయడంతో పాటు అనంతరం రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇప్పుడు PTI చేపట్టిన లాంగ్ మార్చ్‌తో పాకిస్థాన్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా మోహరిస్తున్న ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

