NTV Telugu Site icon

Imran Khan: మరోసారి భారత్ ను ప్రశంసించిన ఇమ్రాన్ ఖాన్

Pm Imran Khan

Pm Imran Khan

మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇటీవల వరసగా భారత్ విధానాలను ప్రశంసిస్తున్నారు. పాకిస్తాన్, భారత్ లాగా ప్రజల ప్రయోజనాలను ఆలోచించడం లేదని పలు మార్లు విమర్శలు చేశారు. తాజాగా భారత ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించడంపై ఆయన స్పందించారు. భారత్ క్వాడ్ లో సభ్యదేశం అయినా… అమెరికా నుంచి ఒత్తడి ఉన్నా కూడా రష్య నుంచి చమురును రాయితీతోదిగుమతి చేసుకుందని ప్రశంసించారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానంలో పని చేస్తుందని అన్నారు.

ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ తలాతోక లేని కోడిలా తయారైందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. గతంలో మా ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రజల అవసరాలే ప్రధానం కానీ.. ఇప్పుడున్న ప్రభుత్వంలోని మీర్ జాఫర్లు, మీర్ సాదిక్ లు బలవంతంగా బాహ్య దేశాల ఒత్తడికి తలొగ్గుతున్నారని విమర్శించారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ సర్కార్ లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గించిన తర్వాత ట్విట్టర్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు ఏప్రిల్ లో కూడా ఇమ్రాన్ ఖాన్ భారత్ ను ప్రశంసించారు. ఏ సూపర్ పవర్ కూడా భారత దేశాన్ని ఆదేశించలేదని అన్నారు. భారత్ కు తమ ప్రజల సంక్షేమమే ముఖ్యం అంటూ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్. ఏ విదేశీ శక్తులు కూడా భారత్ లొంగదీసుకోలేవని అన్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ ఏ దేశ పక్షం వహించడానికి నిరాకరించినప్పుడు కూడా ఏ ఒక్క అగ్రరాజ్యం కూడా ఒక్క మాట అనలేదని అన్నారు. భారతీయులకు విపరీతమైన ఆత్మగౌరవం ఉందని… వారి విదేశాంగ విధానాలపై ఒత్తడి తీసుకురాలేరని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు.