NTV Telugu Site icon

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టును అక్రమం అని నిన్న పాక్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’(ఎన్ఏబీ)ని ఆదేశించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ‘ఆల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో ఆయనను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

READ ALSO: The Kerala Story: సినిమాను ఎందుకు బ్యాన్ చేశారు.? బెంగాల్ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..

ఇమ్రాన్ ఖాన్ ను భారీ భద్రత నడుమ అధికారులు హైకోర్టులో హాజరుపరిచారు. ఆయన హైకోర్టుకు వచ్చే సమయంలో పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆయన మద్దతుదారులు ఆయనకు సపోర్టుగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే ఆయన ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన కేసు ‘ తోషాఖానా’ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఆయనకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. మూడు రోజుల క్రితం ఇస్లామాబాద్ హైకోర్టులోనే పాకి పారామిలిటరీ రేంజర్లు భారీ ఎత్తున వచ్చి, ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు రాజధానితో సహా కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. పలుచోట్ల ఆర్మీ కార్యాలయాలు లక్ష్యంగా దాడులు చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఆయనకు మద్దతుగా శ్రీనగర్ హైవే జీ-13పై ఆందోళనలు జరిగాయి. రాళ్లరువ్వారు, దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఆందోళనలో 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.