Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వందకు పైగా కేసుల్లో ఇరుక్కోవడం తెలిసిన విషయమే. కొన్ని రోజుల క్రితం ఆయన అరెస్ట్ తర్వాత ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు పాల్పడ్డారు. ఇదిలా ఉంటే ఆయనతో పాటు ఆయన పార్టీ కార్యకర్తలు పలు కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే తనను అరెస్ట్ చేసినా, జైలులో పెట్టినా, వచ్చే ఎన్నికల్లో తన పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఇమ్రాన్ ఖాన్ ధీమా వ్యక్త చేశారు.
Read Also: Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఐ సహకారం.. పోర్చుగల్‌లో కొత్త స్థావరం..
ఓ అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తనను జైలులో వేస్తుందని..దానికి పెద్దగా సమయం పట్టదని, నేను బయట ఉంటే నా పార్టీకి బలం వస్తుందని వారు భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అందుకే నన్ను జైలులో పెట్టి ఎన్నికల్లో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ చర్య ద్వారా తనపై అనర్హత వేయాలన్నది వారి ప్లాన్ అని అన్నారు. ఇప్పటికే వేలాదిగా తన పార్టీ కార్యకర్తలను జైలుకు పంపారని, అయినప్పటికీ నేను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతూనే ఉన్నానని.. మమ్మల్ని ఎంత అణిచివేస్తే మా పార్టీకి అంత మద్దతు లభిస్తుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
రాజకీయాలంటే వరస్ట్ కెరీర్ అని.. రాజకీయాలే కెరీర్ గా నేను ఇందులోకి రాలేదని, రాజకీయాలు వృత్తిగా భావిస్తే నేనెవ్వరిని ప్రోత్సహించనని, నా కుమారులను కూడా రాజకీయాల్లోకి రావద్దని చెబుతానని ఇమ్రాన్ అన్నారు. రాజకీయాలంటే ఓ లక్ష్యంతో కూడుకున్నవని ఆయన అన్నారు. నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, మహ్మద్ అలీ జిన్నా లాంటి వారు స్వేచ్ఛ కోసం పోరాటం చేశారని..వారు నిస్వార్థసేవకులని, వారేప్పుడు అధికారం కోసం ప్రయత్నించలేదగని.. ఓ లక్ష్యం కోసం పోరాడారని, వారే నాకు స్పూర్తి అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పీటీఐదే విజయమని అన్నారు.
