NTV Telugu Site icon

Boris Johnson: ‘పుతిన్ మహిళ అయి ఉంటే’.. బ్రిటన్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

Britain Prime Minister Boris Johnson

Britain Prime Minister Boris Johnson

ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తూ భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధాన్ని ఆపాలని పలు దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ రష్యా ససేమిరా వెనక్కి తగ్గడం లేదు. రష్యాపై ఆంక్షలు విధిస్తూ పుతిన్‌ సేనను కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. మహిళ అయి ఉంటే ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టేవాడు కాదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఉక్రెయిన్‌పై సైనికచర్య.. విషపూరిత మగతనానికి కచ్చితమైన ఉదాహరణగా అభివర్ణించారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలకు మెరుగైన విద్య అందించాలని, ఎక్కువమంది మహిళలు అధికారం చేపట్టాలని బ్రిటన్ ప్రధాని జాన్సన్ పిలుపునిచ్చారు. జర్మన్ మీడియా మంగళవారం రాత్రి ఈ వివరాలను వెల్లడించింది.

ప్రపంచంలో బాలికలు, మహిళలు విద్యావంతులు కావాలని, బాలికలకు మెరుగైన విద్యను అందించాలని పిలుపునిచ్చారు. మరింత ఎక్కువ మంది మహిళలు అధికార స్థానాల్లోకి రావాలన్నారు. పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేయడం దూకుడు స్వభావంగల మగతనపు లక్షణాలకు నిదర్శనమని చెప్పారు. ఈ యుద్ధం ముగిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఒప్పందం లేదన్నారు. పుతిన్ శాంతి ఒప్పందం కోసం ముందుకు రావడం లేదని చెప్పారు. రష్యాతో శాంతి చర్చలు సాధ్యమైతే ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా మెరుగైన స్థితిలో ఉండటం కోసం పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలవాలన్నారు.

ఈ యుద్ధం ముగిసిపోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని.. కానీ, అందుకు ప్రస్తుతం ఏవిధమైన పరిష్కార మార్గాలూ కనిపించడం లేదని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. శాంతి కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎటువంటి ప్రయత్నాలూ చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఒకవేళ మాస్కోతో శాంతిచర్చలు సాధ్యమైతే మాత్రం అప్పుడు ఉక్రెయిన్‌ను ఉత్తమమైన స్థితిలో ఉంచడానికి పాశ్చాత్య మిత్రదేశాలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడ్డారు.

Show comments