NTV Telugu Site icon

Iran-Israel: ఇరాన్ అణు పరిశోధన కేంద్రాన్ని ఐడీఎఫ్ ధ్వంసం చేసినట్లు కథనాలు!

Iranisrael

Iranisrael

ఇరాన్‌‌ అణు పరిశోధనా కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే తెలుస్తోంది. అక్టోబర్ చివరిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడితో పెద్ద ఎత్తునే ముప్పు వాటిల్లినట్లుగా తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్‌లోని పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లోని క్రియాశీలకమైన అణ్వాయుధ పరిశోధన కేంద్రాన్ని ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేసినట్లుగా ముగ్గురు యూఎస్ అధికారులు, ఇజ్రాయెల మాజీ అధికారి ఉటంకిస్తూ తాజాగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి.

హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతం చేసిన తర్వాత ఇరాన్ ప్రతీకారంగా అక్టోబర్ ప్రారంభంలో 180 క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. అయితే గగనతలంలోనే ఈ రాకెట్లను ఐడీఎఫ్ ధ్వంసం చేసింది. కొన్ని మాత్రం టెల్ అవీవ్ ప్రాంతంలో పడినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని ఐడీఎఫ్ తెలిపింది. అయితే ఇరాన్ చర్యపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తప్పు చేసిందని.. ప్రతీకార చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే అక్టోబర్ చివరిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. అయితే ఇరాన్ మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. తాజా నివేదికలను బట్టి అణ్వాయుధ పరిశోధన కేంద్రం ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.

అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి పౌరులను బందీలుగా తీసుకుపోయింది. ఆరోజు నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడింది. గాజా పట్టణాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అంతేకాకుండా హమాస్ అగ్ర నేతలందరినీ హతం చేసింది. ఇక హమాస్‌కు మద్దతుగా కాలుదువ్విన హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థపై కూడా ఐడీఎఫ్ దళాలు దాడుల చేశాయి. హిజ్బుల్లా అగ్ర నేతలను హతం చేసింది. ప్రస్తుతం హమాస్, హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.