NTV Telugu Site icon

Hurricane Beryl: టెక్సాస్ లో బెరిల్ తుఫాన్ బీభత్సం.. ముగ్గురు మృతి..!

Texas

Texas

Hurricane Beryl: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బెరిల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ కార‌ణంగా బలమైన గాలులు, కుండపోత వర్షం కురుస్తుండటంతో సోమవారం టెక్సాస్‌లో ముగ్గురు మరణించారు. అలాగే, కరెంట్ కు తీవ్ర అంత‌రాయం కొనసాగుతుండటంతో 2.7 మిలియన్లకు పైగా ప్రజలు అంధ‌కారంలో ఉన్నారు. వ‌ర‌ద నీటి తాకిడితో ర‌హ‌దారులు పూర్తిగా దెబ్బ తినడంతో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. దాదాపు, 1,300కు పైగా విమాన స‌ర్వీసుల‌ను అధికారులు క్యాన్సిల్ చేశారు. ఇక, గత వారం బెరిల్ హరికేన్ ధాటికి జమైకా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ లో కూడా విధ్వంసం సృష్టించింది. అలాగే, టెక్సాస్‌కు సమీపంలోని మెక్సికో, కరేబియన్‌లలో సుమారు 11 మంది మృత్యువాత పడ్డారు అని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ పాట్రిక్ వెల్లడించారు.

Read Also: US React PM Modi Russia Tour: భారత ప్రధాని రష్యా పర్యటనపై అమెరికా రియాక్షన్ ఇదే..!

ఇక, తుఫాన్ వల్ల హ్యూస్టన్ ప్రాంతంలో ఇళ్లపై చెట్లు కూలిన ఘటనలో మరో ఇద్దరు మరణించారు. ఇక విద్యుత్ ప్రసారాన్ని పునరుద్ధరించడానికి చాలా రోజుల సమయం పడుతుందని టెక్సాస్ పబ్లిక్ యుటిలిటీ కమిషన్ చైర్ థామస్ గ్లీసన్ పేర్కొన్నారు. టెక్సాస్ డివిజన్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ చీఫ్ నిమ్ కిడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 2,500 మంది ఫస్ట్ రెస్పాండర్‌లను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చర్యలు కోసం రంగంలోకి దిగినట్లు తెలిపారు. అలాగే, సోమ‌వారం తెల్లవారుజామున గాల్వెస్టన్, సార్జెంట్, లేక్ జాక్సన్, ఫ్రీపోర్ట్ లాంటి నగరాల్లో ఈదురుగాలులు, కుండపోత వర్షం కురిసిన‌ట్లు వెదర్ డిపార్ట్మెంట్ చెప్పుకొచ్చింది. భారీగా పోటెత్తిన‌ వ‌ర‌ద‌ల వ‌ల్ల ర‌హ‌దారులు మొత్తం మునిగిపోయినట్లు చెప్పారు. హ్యూస్టన్‌లోని చాలా ప్రాంతాలలో వరద నీరు 10 అంగుళాలు (25 సెం.మీ.) మించి ప్రవహిస్తుందని మేయర్ జాన్ విట్‌మైర్ చెప్పుకొచ్చారు. ప్రజలందరు అలర్ట్ గా ఉండాలని సూచించారు.