Site icon NTV Telugu

Mahsa Amini: ఇరాన్ యువతి మహ్స అమినికి ఈయూ ప్రతిష్టాత్మక అవార్డ్..

Mahsa Amini

Mahsa Amini

Mahsa Amini: మహ్సా అమిని.. ఈ ఒక్క పేరు యావత్ ఇరాన్ దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. మతరాజ్యంగా ఉన్న ఇరాన్ దేశంలో మహిళలు రోడ్డెక్కి పోరాడారు. హిజాబ్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా యురోపియన్ యూనియన్(ఈయూ)కి సంబంధించిన ప్రతిష్టాత్మక మానవహక్కుల బహుమతిని ‘సఖరోవ్’ ప్రైజ్‌ని ప్రధానం చేసింది. సోవియట్ అసమ్మతివాది ఆండ్రీ సఖారోవ్ పేరు మీద ఈయూ ఈ అవార్డును 1988లో మానవహక్కులు, స్వేచ్ఛను రక్షించే వ్యక్తలుకు అందిస్తోంది.

గతేడాది ఖుర్దిష్ యువతి 22 ఏళ్ల మహ్స అమిని పోలీస్ కస్టడీలో మరణించింది. హిజాబ్ ధరించలేదనే ఆరోపణలపై అక్కడి మోరాలిటీ పోలీసులు మహ్సా అమినిని అరెస్ట్ చేసి, కొట్టారు. దీంతో ఆమె కస్టడీలోనే మరణించారు. ఆమె మరణంతో యావత్ ఇరాన్ ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్‌లోని అయతుల్లా అలీ ఖమేని ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంది.

Read Also: Bastar: అప్పుడు కేరళ స్టోరీ.. ఇప్పుడు ‘బస్తర్’.. నక్సలైటుగా మారిన అదా శర్మ?

అక్కడి యువత, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. మహిళలు జట్టు కత్తరించుకుని, హిజాబ్ విసిరేస్తూ ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇటు ప్రభుత్వ భద్రతా సిబ్బంది, సాధారణ ప్రజలు మరణించారు. అయితే ఈ నిరసనలను అక్కడి మతఛాందసవాద ప్రభుత్వం అణిచివేసింది. ఈ అల్లర్లకు పాల్పడిన కొంతమంది వ్యక్తుల్ని ఉరితీసింది. ఇటీవల అమిని మృతికి వ్యతిరేకంగా పోరాడిన కుర్దిష్ మహిళా హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది.

Exit mobile version