Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..

  • సౌదీ రక్షణ శాఖపై హైతీల క్షిపణి దాడి.. ఆయిల్ రిఫైనరీపై కూడా దాడి చేసినట్లు ప్రకటన.. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఘర్షణ.. శాంతి ఒప్పందం కోసం సౌదీ ప్రయత్నాలు..
Saudi Arabia

Saudi Arabia

Saudi Arabia: మిడిల్ ఈస్ట్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడికి పాల్పినట్లు ప్రకటించారు. ఇదే కాకుండా సౌదీలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన రాస్ తనురాపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ రెండు దాడుల్ని సౌదీ అరేబియా అధికారికంగా ధ్రువీకరించలేదు.

రియాద్‌లోని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖపై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యాహ్య సరీ ప్రకటించారు. మంగళవారం ఉదయం సౌదీ అరేబియాలోని రాస్ తానూరా చమురు శుద్ధి కర్మాగార సముదాయంపై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు హౌతీలు చెప్పారు. ఈ దాడితో రిఫైనరీలో భారీగా మంటలు ఎగిసిపడినట్లు పేర్కొన్నారు.

వరస దాడులతో సతమతం అవుతున్న సౌదీ అరేబియా హౌతీలతో శాంతి ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. టెహ్రాన్‌లో జరిగిన ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, టర్కీ ప్రతినిధులు, ఇరాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిపై సౌదీ రక్షణ శాఖ స్పందిస్తూ.. ఉద్రిక్తతల్ని తగ్గించడం, చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాలను ప్రోత్సహించడం ఈ పర్యటన లక్ష్యమని పేర్కొంది. ఈ డీల్ కోసం సౌదీ హౌతీలకు 1 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.