Yevgeny Prigozhin: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా పేరున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కే ఓ వ్యక్తి సవాల్ విసురుతున్నాడు. రష్యాలో తిరుగుబాటును లేవనెత్తిన వాగ్నర్ గ్రూప్ ఇప్పుడు ప్రపంచాన్ని ఉక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ఇప్పడు హాట్ టాపిక్ గా మారాడు. పుతిన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ప్రిగోజిన్, ఇప్పుడు ఏకంగా రష్యా ప్రభుత్వాన్ని, సైన్యాన్ని, ఏకంగా పుతిన్ నే సవాల్ చేస్తున్నాడు. కిరాయి సైన్యంగా ఉన్న వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ఉన్నట్టుంది రష్యా ఆర్మీ, వాగ్నర్ గ్రూప్ మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. రష్యా ఆర్మీ, వాగ్నర్ గ్రూప్ సైన్యాన్ని చంపేస్తుందని ఆరోపిస్తూ తిరుగుబాటు లేవదీశాడు.
రష్యా పాలనలో ఒలిగార్క్‌లకే ఎక్కువ ప్రాధన్యత ఉంటుంది. రష్యాలో ధనిక వర్గంగా ఉన్న వీరు ఖనిజాలు, ఇంధనం వంటి వాటిని నియంత్రిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఫుడ్ కాంట్రాక్టులు ప్రధానంగా ఉన్న యెవ్జెనీ ప్రిగోజిన్ ఏకంగా రష్యానే భయపెడుతున్నాడు. ఫుడ్ కాంట్రాక్టులే కాదు అతని కనుసన్నల్లో ఓ పుతిన్ ప్రైవేట్ ఆర్మీ ‘వాగ్నర్ గ్రూప్’ పనిచేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులకు చేతకానీ పనిని, బఖ్‌ముత్ పట్టణాన్ని ఆక్రమించుకుని తన సత్తా ఏంటో చూపింది వాగ్నర్ గ్రూప్. ఇప్పుడు అలాంటి గ్రూప్ ఏకంగా సర్వశక్తివంతుడైన పుతిన్ ను సవాల్ చేస్తోంది.
వంట మనిషి.. పుతిన్‌కి సన్నిహితుడు..
రష్యాలో యెవ్జెనీ ప్రిగోజిన్ అంటే తెలియనవారు ఉండరు. ఇతను కూడా పుతిన్ సొంత నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్ కి చెందినవాడే. 1980ల్లో దొంగతనం, దోపిడి కేసుల్లో ప్రిగోజిన్ దాదాపుగా 9 ఏళ్లు జైలు శిక్షను అనుభవించాడు. 1990ల్లో పుతిన్, ప్రిగోజిన్ కి పరిచయం ఏర్పడింది. 1990ల్లో రెస్టారెంట్ బిజినెస్ లోకి ప్రిగోజిన్ ఎంట్రీ ఇచ్చాడు. పుతిన్ తొలిసారి రష్యా అధ్యక్షుడిగా 2000లో ఎన్నికైక తర్వాత క్రమంగా విస్తరించాడదు. తన రెస్టారెంట్ వ్యాపారాన్ని రష్యా మొత్తం విస్తరించారు. ప్రభుత్వానికి చెందిన సైనిక, ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కేవి. ఇతడిని ‘పుతిన్ చెఫ్’గా పిలుస్తారు.
అయితే 2014లో రష్యా, ఉక్రెయిన్ ద్వీపకల్పమైన క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో తొలిసారిగా వాగ్నర్ గ్రూప్, ప్రిగోజిన్ పేర్లు బయటకు వచ్చాయి. ఈ ఆక్రమణలో ప్రిగోజిన్ కీలకంగా వ్యవహరించడంతో అమెరికా అతనిపై 2016లో ఆంక్షలు విధించింది. అమెరికా ఎఫ్బీఐ అతనిపై 2,50,000 డాలర్ల రివార్డు కూడా ఉంది. మరోవైపు 2016లో ట్రంప్ కు అనుకూలంగా ఈ గ్రూపే ప్రచారం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఏమిటీ వాగ్నర్ గ్రూప్..
వాగ్నర్ గ్రూప్ ఒక ప్రైవేట్, కిరాయి ఆర్మీ. దీన్ని రష్యా సైన్యంలో పనిచేసిన మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రి ఉత్కిన్ ప్రారంభించారు. జర్మనీ నియంతకు ఇష్టమైన ఒపెరా కంజోజన్ వాగ్నర్ పేరిటి దీన్ని ప్రారంభించారు. ఈ గ్రూపులో రష్యా రిటైర్డ్ సైనికులే ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే రష్యా ఆర్మీతో పోలిస్తే, వాగ్నర్ గ్రూపులోని సైనికులకే ఎక్కువగా చెల్లింపులు జరుగుతుంటాయి.
నిజానికి ఈ గ్రూపులో ఎలైట్ రెజిమెంట్లు, ప్రత్యేక దళాల నుంచి దాదాపుగా 5000 మంది సైనికులు ఉన్నట్లు భావిస్తారు. అయితే ఈ ఏడాది యూకే రక్షణ మంత్రి శాఖ లెక్కల ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న వాగ్నర్ గ్రూపులో 50,000 పోరాట యోధుల్ని కలిగి ఉందని తెలియజేసింది. ఉక్రెయిన్ లో పోరాడుతున్న వాగ్నర్ గ్రూపులో 80 శాతం సభ్యులు జైల్ల నుంచి వచ్చారు.
రష్యాలోనే కాకుండా పలు దేశాల్లో కూడా వాగ్నర్ గ్రూప్ రహస్యంగా పనిచేస్తుంది. లిబియా సివిల్ వార్, సిరియా, మోజాంబిక్, మాలి, సుడాన్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వెనుజులా వంటి దేశాల్లో వాగ్నర్ గ్రూప్ ఉంది. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు వాగ్నర్ గ్రూప్ రష్యా సైన్యంతో కలిసి పనిచేస్తుంది. ఉక్రెయిన్ లో రష్యా తరుపున యుద్ధం చేస్తోంది. విదేశాల్లో రష్యా లక్ష్యం కోసం పనిచేస్తుంటారు. తాజా పరిణామాల నేపథ్యంలో వాగ్నర్ గ్రూపుపై పుతిన్ ఏం చేస్తారో వేచి చూడాలి.
