Site icon NTV Telugu

Hollywood Strike: హాలీవుడ్‌ నటుల సమ్మె .. మూతపడిన ఇండస్ట్రీ

Hollywood

Hollywood

Hollywood Strike: సాంకేతిక రంగంలో ముందుకొచ్చిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్(ఏఐ) అన్ని వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్‌ రంగంపై ప్రభావం చూపుతోందని వారు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ దీని ప్రభావం పడింది. హాలీవుడ్‌లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తన ప్రభావం చూపుతోంది. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, రెమ్యూనరేషన్లు పెంచాలని, ఏఐ నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించాలని డిమాండ్‌ చేస్తూ హాలీవుడ్‌కు చెందిన ‘ది స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌’ సమ్మెకు దిగింది. నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో నిరవధిక సమ్మెకు గిల్డ్‌ పిలుపునిచ్చింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచి గిల్డ్‌లో ఉన్న లక్షా 60 వేల మంది నటీనటులు సమ్మెబాట పట్టారు. ఇవే డిమాండ్లతో గత 11 వారాలుగా రైటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా సమ్మెకు దిగింది. తాజాగా వారికి నటీనటులు తోడవంతో హాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీ మూతపడినట్లయింది. ఇలా రచయితలు, నటులు ఒకేసారి సమ్మెకు దిగడం గత 63 ఏండ్లలో హాలీవుడ్‌లో ఇదే తొలిసారి.

Read also: Credit Card: రికార్డు సృష్టించిన క్రెడిట్ కార్డు వినియోగం.. తొలిసారి రూ.1.4లక్షల కోట్ల వ్యయం

హాలీవుడ్‌లో మొదటిసారిగా 1960లో నటుడు రోనాల్డ్‌ రీగన్‌ నేతృత్వంలో రెండు యూనియన్లు డబుల్‌ స్ట్రైక్‌ చేశాయి. 1980లో స్క్రీన్‌ యాక్టర్స్‌ సమ్మె జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత రైటర్స్‌ గిల్డ్‌, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ కలిసి మరోసారి డబుల్‌ స్ట్రైక్‌ చేస్తున్నాయి. ఈసారి 98 శాతం మంది నటీనటులు ఈ సమ్మెకు మద్దతు తెలపడం విశేషం. ప్రస్తుత సమ్మెతో హాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలు, టీవీ సిరీస్‌లు ఆలస్యం కానున్నాయి. ఇదిలాగే కొనసాగితే భారీ సినిమాల రిలీజ్‌లు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాల ప్రమోషన్లకు కూడా నటీనటులు దూరంగా ఉండనున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని, ఇప్పుడు కనుక తాము తమ గళం వినిపించకపోతే కష్టాల్లో పడతామని గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డ్రెషర్ అన్నారు. అత్యాశకు పోతున్న స్టూడియోల వల్ల తాము బాధితులం అవుతున్నామని నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version