Pete Hegseth Impeachment: అమెరికా రాజకీయాల్లో మరోసారి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో విజయం సాధించిన డెమోక్రాట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో పాటు ఆయనపై అభిశంసన (Impeachment) ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ నాయకుడు హకీమ్ జెఫ్రీస్.. పీట్ హెగ్సెత్‌పై అభిశంసన తీర్మానాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ఇరాన్‌తో యుద్ధాన్ని ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు.
హెగ్సెత్‌పై అభిశంసనకు డెమోక్రాట్ల మద్దతు
ఆదివారం ABC న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హకీమ్ జెఫ్రీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి థామస్ మాసీ ప్రతిపాదించనున్న అభిశంసన తీర్మానానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం డెమోక్రటిక్ పార్టీ సభ్యులు మరోసారి సమావేశమైనప్పుడు ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. పీట్ హెగ్సెత్‌పై తీవ్ర విమర్శలు చేసిన జెఫ్రీస్.. ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేశారని, అమెరికా జాతీయ భద్రతను బలహీనపరిచారని ఆరోపించారు. ఇరాన్‌పై బాధ్యతారహితమైన, భారీ ఖర్చుతో కూడిన యుద్ధాన్ని అమెరికాపై రుద్దారని విమర్శించారు. ఈ యుద్ధం కారణంగా అమెరికా ప్రజలకు నిత్యావసరాల ధరల భారం పెరిగిందని, దేశ భద్రత కూడా గతంలో కంటే బలహీనపడిందని పేర్కొన్నారు. “పీట్ హెగ్సెత్ పదవి నుంచి వెళ్లిపోవాల్సిందే” అంటూ జెఫ్రీస్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇరాన్‌తో యుద్ధాన్ని ముగిస్తాం: డెమోక్రాట్లు
ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణను ముగించేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తుందని జెఫ్రీస్ వెల్లడించారు. జనవరిలో కాంగ్రెస్‌పై నియంత్రణ సాధించిన తర్వాత ఈ యుద్ధాన్ని ముగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ యుద్ధం అమెరికాకు భారీ ఆర్థిక భారంగా మారిందని, ప్రజల జీవన వ్యయాన్ని పెంచిందని ఆయన ఆరోపించారు. అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్న ఈ ఘర్షణను ముగించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
అభిశంసన ప్రయత్నాలను తోసిపుచ్చిన హెగ్సెత్
మరోవైపు, తనపై వస్తున్న అభిశంసన ఆరోపణలను పీట్ హెగ్సెత్ తీవ్రంగా ఖండించారు. CNN కథనం ప్రకారం, ఒక వీడియో ద్వారా స్పందించిన ఆయన.. అభిశంసన ప్రయత్నాలను వ్యక్తిగతంగా తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా అభివర్ణించారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలతో తనను బలహీనపరచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ట్రంప్ ప్రభుత్వంపై విస్తృత విచారణకు డెమోక్రాట్ల సిద్ధం
మిడ్‌టర్మ్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంపై మరిన్ని విచారణలు చేపట్టేందుకు డెమోక్రాట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తదుపరి కాంగ్రెస్‌లో హౌస్ ఓవర్‌సైట్ కమిటీకి అధ్యక్షత వహించే అవకాశం ఉన్న డెమోక్రటిక్ ప్రతినిధి రాబర్ట్ గార్సియా.. ట్రంప్ కుటుంబం, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై విస్తృత విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ట్రంప్ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ‘ట్రంప్ క్రైమ్ ఫ్యామిలీ’ అనే పదాన్ని ఉపయోగించారు. “ఇకపై మౌనంగా భరించే రోజులు ముగిశాయి” అంటూ గార్సియా వ్యాఖ్యానించారు.
డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
మరోవైపు, తమ ప్రభుత్వంపై విచారణలు చేపట్టేందుకు డెమోక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. డెమోక్రాట్లు చేస్తున్న డిమాండ్లను అత్యున్నత స్థాయి బెదిరింపులు, బలవంతపు వసూళ్లతో కూడిన చర్యలుగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని బాధ్యులుగా చేయాలని పేర్కొన్నారు.

