Site icon NTV Telugu

Saudi Arabia: సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. మక్కాకు వెళ్లే రహదారి బ్లాక్..

Saudi Rains

Saudi Rains

Heavy Rains Hit Saudi Arabia, Block Road To Mecca: అరబ్ కంట్రీ, ఎడారి దేశం, అసలు వర్షపాతమే పెద్దగా ఉండని సౌదీ అరేబియాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సౌదీ కోస్టల్ సిటీ జెడ్డాతో పాటు పశ్చిమ సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా గురువారం ఇద్దరు మరణించినట్లు అక్కడి ప్రబుత్వం వెల్లడించింది. వర్షాల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయి. పాఠశాలలను మూసేయాలని.. అవసరం అయితే తప్పా బయటకు రావద్దని మక్కా ప్రాంతీయ ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా ప్రజలకు సూచించింది.

Read Also: Super Earth: సూపర్ ఎర్త్‌ని గుర్తించిన నాసా.. భూమికి డబుల్ సైజ్..

సౌదీలో రెండో అతిపెద్ద నగరం జెడ్డా, మక్కా ప్రాంతంలోనే ఉంది. ప్రతీ సంవత్సరం మక్కాను సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వస్తుంటారు. హజ్, ఉమ్రా తీర్థయాత్రలకు కోసం మక్కా నగరానికి వస్తుంటారు. అయితే మక్కాను కలిపే రెండు రహదారులను వర్షం కారణంగా గురువారం మూసేశారు. జెడ్డా నగరంలో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచింది. కొన్ని చోట్ల వాహనాలు పాక్షికంగా మునిగిపోయాయి. నగరంలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యాయి.

గురువారం రోజంతా వర్షం ఉండటంతో పాఠశాలలను మూసేశారు. అంతకుముందు రోజు అర్జెంటీనాపై సౌదీ అరేబియా గెలపొందడటంతో కింగ్ సల్మాన్ బుధవారం సెలవు ప్రకటించారు. ఆ తరువాత రోజు నుంచి వర్షాలు ప్రారంభం అయ్యాయి. జెడ్డా నగరంలో ప్రతీ ఏడాది శీతాకాలంలో వర్షాలు సంభవిస్తుంటాయి. 2009లో సౌదీలో వచ్చిన వరదల్లో జెడ్డాలో 123 మంది మరణించారు. రెండేళ్ల క్రితం వరదల్లో 10 మంది మరణించారు.

Exit mobile version