Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం

Hamas

Hamas

Gaza Conflict: గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హమాస్ సాయుధ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ కీలక ప్రకటన చేసింది. దక్షిణ గాజాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ రఫా బ్రిగేడ్ కమాండర్ సమీర్ మహ్మూద్ అబూ యూనిస్ మరణించినట్లు నవంబర్ 15న ప్రకటించింది. అబూ యూనిస్ హమాస్‌కు చెందిన జనరల్ మిలిటరీ కౌన్సిల్ సభ్యుడు కూడా అని ఆ సంస్థ పేర్కొంది. ఖాన్ యూనిస్‌లోని అల్-మవాసి ప్రాంతంలో జరిగిన దాడిలో ఆయన మరణించినట్లు సమాచారం.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. భద్రతా సంస్థ షిన్ బెట్‌తో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో హమాస్ సాయుధ విభాగానికి చెందిన ఒక సీనియర్ సభ్యుడిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అయితే, ఇజ్రాయెల్ విడుదల చేసిన ప్రకటనలో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి పేరును వెల్లడించలేదు.

నాసర్ మెడికల్ కాంప్లెక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, అల్-మవాసి ప్రాంతంలో జరిగిన ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో ఒక పాలస్తీనీయుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమీర్ అబూ యూనిస్ హమాస్‌కు చెందిన రఫా బ్రిగేడ్‌కు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఆయనకు ముందు ఈ బాధ్యతలను నాయెల్ అబూ ఒబైద్ నిర్వహించారు. నాయెల్ అబూ ఒబైద్ సెప్టెంబర్ 15న ఖాన్ యూనిస్‌లో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్లు సమాచారం.

గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అక్టోబర్ 10, 2025న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్ చర్యల్లో 1,643 మంది పాలస్తీనీయులు మరణించగా, 5,964 మంది గాయపడినట్లు పేర్కొంది. అలాగే, అక్టోబర్ 2023 నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో ఇప్పటివరకు 74,000 మందికిపైగా పాలస్తీనీయులు మరణించారని, 176,000 మందికిపైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతులు, క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారుల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ ఘర్షణ కారణంగా గాజా ప్రాంతం తీవ్ర విధ్వంసాన్ని ఎదుర్కొంటోంది. నివేదికల ప్రకారం, అక్కడి మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన గాజా పునర్నిర్మాణానికి సుమారు 71.4 బిలియన్ డాలర్లు అవసరం కావచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసినట్లు సమాచారం.