Site icon NTV Telugu

USA: అమెరికా ఆశ ప్రాణాలు తీసింది.. మెక్సికో గోడపై నుంచి జారిపడ్డ కుటుంబం.. ఒకరు మృతి

Gujarat Trump Wall

Gujarat Trump Wall

Gujarat Man Falls To Death From US Border: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుడు ప్రమాదవశాత్తు మరణించాడు. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ తాలూకా నివాసి అయిన బ్రిజ్ కుమార్ యాదవ్ మెక్సికో-అమెరికా సరిహద్దు దాటుతూ మరణించినట్లు అమెరికన్ మీడియా వార్త కథనాలను ప్రచురించింది. ‘ట్రంప్ వాల్’గా పిలువబడే భారీ గోడ అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ఉంది. ఈ గోడను దాటి బ్రిజ్ కుమార్ కుటుంబం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలని చూసింది. గోడను ఎక్కుతున్న క్రమంలో బ్రిజ్ కుమార్ జారి పడిపోయి మరణించాడు. ఈ ప్రమాదంలో అతని భార్య, మూడేళ్ల కుమారుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయని తెలుస్తోంది. 30 అడుగుల ఎత్తు నుంచి ఈ కుటుంబ జారి పడిపోయింది. భార్య అమెరికాలో, కుమారుడు మెక్సికోలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై గుజరాత్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు శుక్రవారం వెల్లడించారు. బ్రిజ్ కుమార్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లోని కలోల్ యూనిట్‌లోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు బాధితులు గోడను ఎక్కే క్రమంలో చాలా ఎత్తు నుంచి పడిపోయారు. ఇందులో బ్రిజ్ కుమార్, అతని భార్య అమెరిక వైపు పడిపోగా.. వారి మూడేళ్ల కొడుకు మెక్సికో వైపు పడిపోయాడు. మీడియా ద్వారా వస్తున్న వార్తలను నిర్థారించేందుకు గుజరాత్ రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) రంగంలోకి దిగింది. అక్రమ వలసలకు పాల్పడుతున్న ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Boianapalli Vinod Kumar : దేశంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కరెంట్ లేదు..

ఈ ఘటనపై గాంధీనగర్ ఎస్పీ తరుణ్ కుమార్ దుగ్గల్ విచారణ ప్రారంభించారు. అయితే బ్రిజ్ కుమార్ ఉత్తర్ ప్రదేశ్ లేదా ఢిల్లీకి చెందిన వ్యక్తి అని అతడి కుటుంబం కలోల్ లో స్థిరపడినట్లు తెలుస్తోంది. బాధితుడిని కనుక్కోవడానికి, నిర్థారించడానికి ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రస్తుతానికి అతని కుటుంబీకులు ఎవరూ కూడా పోలీసులను సంప్రదించలేదని తెలుస్తోంది.

అక్రమ వలసలను అడ్డుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మెక్సికో, అమెరికా సరిహద్దుల్లో భారీ గోడను నిర్మించాడు. అయితే తాజాగా ఆ గోడను దాటే క్రమంలోనే కుటుంబం ప్రమాదానికి గురైంది. ఈ ఏడాది ఇలాగే కెనడా-అమెరికా సరిహద్దులను దాటే క్రమంలో ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు చనిపోయారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా..తీవ్రమైన చలి ధాటికి వారంతా ప్రాణాలు వదిలారు. వీరు కూడా కలోలో ప్రాంతంలోని డింగుచా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మార్చి నెలలలో కెనడా సరిహద్దుల్లోని సెయింట్ రెగిస్ నదిలో పడవ మునిగిపోవడంతో కెనడా నుంచి యూఎస్ఏలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు గుజరాత్ యువకులను అధికారులు అరెస్ట్ చేశారు.

Exit mobile version