శత్రు దేశానికి ఆమె విరాళం ఇవ్వడమే శాపమైంది. ఒక స్వచ్ఛంద సంస్థకు తన వంతుగా సహాయం చేసింది. అదే ఆమెకు ముప్పు తెచ్చిపెట్టింది. దయాది దేశానికి విరాళం ఇచ్చినందుకు రష్యా న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. అంతే అమెరికా-రష్యన్ పౌరురాలికి ఏకంగా 12 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
ఆరిజన్ బ్యాలెట్ డ్యాన్సర్ క్సేనియా కరేలీనా(32) అమెరికా-రష్యన్ పౌరురాలు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నివాసం ఉంటుంది. అయితే ఆమె రష్యా.. శత్రు దేశమైన ఉక్రెయిన్ అనుకూల స్వచ్ఛంద సంస్థకు 50 డాలర్లకు పైగా విరాళం ఇచ్చింది. అయితే దీన్ని రష్యా చాలా సీరియస్‌గా పరిగణించింది. గత జనవరిలో రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లో తన కుటుంబాన్ని సందర్శించేందుకు క్సేనియా కరేలీనా రష్యా వచ్చింది. అంతే వెంటనే రష్యా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహానికి పాల్పడిందంటూ అరెస్ట్ చేశారు. తమ పౌరులను నిరాధార ఆరోపణలపై అరెస్ట్ చేయడాన్ని వాషింగ్టన్ తప్పుపట్టింది. ఆమెను విడిపించేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు.
అయితే ఈ కేసు విచారణ సందర్భంగా గత వారం విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు రాష్ట్ర మీడియా తెలిపింది. క్సేనియా కరేలీనా రాజద్రోహానికి పాల్పడినట్లుగా న్యాయస్థానం గురువారం (15-08-2024) నిర్ధారించింది. దీంతో ఆమెకు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు యురల్స్ నగరంలోని యెకటెరిన్‌బర్గ్‌లోని స్వర్డ్‌లోవ్స్క్ ప్రాంతీయ కోర్టు తెలిపింది.
న్యాయస్థానం తీర్పును చదివేటప్పుడు కరేలీనా తెల్లటి టాప్, జీన్స్ ధరించింది. అద్దంలో కనిపిస్తున్న ఆమె పంజరంలో నిలబడి ఉంది. కోర్టు పోస్ట్ చేసిన వీడియోలో కనిపించింది. దేశద్రోహం లేదా గూఢచర్యం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారికి రష్యా తరచుగా విదేశీయులకు తీవ్రమైన శిక్షలను విధిస్తోంది. గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు నిలబడడం.. రష్యాకు రుచించడం లేదు.