Site icon NTV Telugu

Gotabaya Rajapaksa: మాల్దీవుల నుంచి సింగపూర్‌కు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స..

Gotabaya Rajapaksa

Gotabaya Rajapaksa

ద్వీపదేశం శ్రీలంక రాజకీయంగా, ఆర్థికంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండగా రాజీనామా చేయకుండా దేశం దాటిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిన్న ఉదయం మాల్దీవులకు వెళ్లారు. మాల్దీవుల్లో కూడా రాజపక్సకు వ్యతిరేకంగా శ్రీలంకవాసులు ఆందోళనలు చేపట్టారు. ఇవాళ మాల్దీవుల నుంచి సింగపూర్‌కు చేరుకున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి ఆయన సౌదీ అరేబియాకు వెళ్లడం లేదని సమాచారం. కొన్ని రోజుల క్రితం శ్రీలంక అధ్యకుడు రాజపక్స.. కొలంబో నుంచి మాల్దీవులకు పారిపోయారు.

రాజపక్సే, అతని భార్య ఐయోమా రాజపక్స, ఇద్దరు భద్రతా అధికారులు గత రాత్రే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో మాలే నుంచి సింగపూర్‌కు వెళ్లాల్సి ఉంది, అయితే భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్ ప్రకారం వెళ్లలేదని డైలీ మిర్రర్ వెల్లడించింది. ఇవాళ సింగపూర్ వెళ్లారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సతీమణి, వారి వెంట ఇద్దరు భద్రతా సిబ్బంది మాల్దీవులకు వెళ్లినట్లు శ్రీలంక వైమానిక దళం బుధవారం ఓ సంక్షిప్త ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ అభ్యర్థన, అధ్యక్షుడిగా గొటబాయకు ఉన్న అధికారాలు, రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి మేరకే కటునాయకె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం వేకువజామున 3 గంటలకు వారిని మాల్దీవులకు తరలించినట్లు వివరించింది. అక్కడినుంచి సౌదీ ఎయిర్​లైన్స్​ ఫ్లైట్​ ఎస్​వీ 788లో సింగపూర్ చేరుకున్నట్లు తెలిసింది.

అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని రణిల్ విక్రమసింఘేను గద్దె దింపాలని నిరసనలు ప్రారంభించిన శ్రీలంక ప్రజలు.. ఆ క్రమంలో అధికారిక నివాసాలను ఆక్రమించారు. తాజాగా వాటిని ఖాళీ చేసేందుకు గురువారం అంగీకరించారు. అయితే, తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధ్యక్షుని భవనం, గాలే ఫేస్ నుంచి మాత్రం వెళ్లబోమని తెలిపారు. బుధవారం బాష్పవాయువు గోళాలు, జల ఫిరంగులను లెక్కచేయకుండా కొలంబోలోని ప్రధాని కార్యాలయంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లారు. భవనంపైకి చేరుకొని జెండాలు ఎగరవేశారు. ఈ ఘర్షణలో 84 మంది గాయపడ్డారు.

Nepal Couple: నమ్మకంగా ఉన్నారు.. అదును చూసి దోచేశారు

73 ఏళ్ల గోటబయ రాజపక్సే జూలై 9న తన నివాసంపైకి నిరసనకారులు దాడి చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బుధవారం తన రాజీనామా లేఖను అందజేస్తానని ఆయన ప్రకటించారు. అనంతరం రాజపక్స తన భార్యతో సహా మాల్దీవులకు పారిపోయారు. తదనంతరం, అతను శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను నియమించారు. మరోవైపు శ్రీలంకలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొలంబో జిల్లాలో కర్ఫ్యూ విధించినట్లు బుధవారం ప్రభుత్వ సమాచార శాఖ ప్రకటించింది. దేశంలో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో రాష్ట్రపతి భవనం, ప్రెసిడెంట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయంతో సహా ప్రభుత్వ ఆక్రమిత భవనాలను శాంతియుతంగా అప్పగిస్తామని “గోటాగోగామా” నిరసనకారులు ప్రకటించారు.

మరోవైపు బుధవారం రాజీనామా చేస్తానని వెల్లడించిన రాజపక్స ఇప్పటి వరకు తన రాజీనామాను అందించలేదు. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. రాజపక్సను శ్రీలంకకు అప్పగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆందోళనలు అణచివేయడానికి శ్రీలంక ఆర్మీ, పోలీసులకు తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఆదేశాలు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే జూలై 20న పార్లమెంట్ ఓటింగ్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్థన్ తెలిపారు.

Exit mobile version