Germany: యూరప్ వ్యాప్తంగా యువత ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తాజాగా జర్మనీలో జెన్-జీ యువత చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. విద్యకు నిధులు పెంచాలని, జీవన వ్యయాన్ని తగ్గించాలని, తప్పనిసరి సైనిక సేవను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది యువత దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని రోడ్లపైకి వచ్చారు. శనివారం రాత్రి ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు దుకాణాలను దోచుకున్నారు. పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారు.
‘జెన్ జడ్ రెగెల్ట్’ (Gen Z regelt) అనే ప్రచార బృందం ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిక్ సహా దేశంలోని 34 నగరాల్లో ఆందోళనలు జరిగాయి. విద్యా రంగంలో బడ్జెట్ కోతలు, పాఠశాలలకు నిధుల కొరత, పెరుగుతున్న జీవన వ్యయం వంటి అంశాలు యువతలో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. ఫ్రాన్స్‌లో కూడా యువత నిరసనలు దోపిడీలు, దహనాలకు దారితీశాయి. ఇప్పుడు జర్మనీలో కూడా ఇదే తరహా అల్లర్లు జరుగుతున్నాయి.
తప్పనిసరి సైనిక సేవను వ్యతిరేకించడంతో పాటు విద్య, వైద్య రంగాలకు మరిన్ని నిదులు కేటాయించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీలో జీవన వ్యయాన్ని తట్టుకోవడం కష్టంగా మారిందని యువత చెబుతోంది. తాము శాంతి, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని, ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు మెరుగైన మద్దతు అందించాలని బెర్లిన్‌లో జరిగిన ర్యాలీలో ‘జెన్ జడ్ రెగెల్ట్’ ప్రతినిధి లీనా ఫ్రెడ్రిక్ అన్నారు.
ఇదిలా ఉంటే, జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రవాద గ్రూపుల ప్రభావంపై హెచ్చరిక చేసింది. వామపక్ష తీవ్రవాద వర్గాల్లోని కొన్ని విభాగాలు, విదేశీ తీవ్రవాద ఉద్యమాలతో సంబంధం ఉన్న కొన్ని గ్రూపులు ఈ నిరసనకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించినట్లు ప్రభుత్వం ఆరోపించింది. ఫ్రాన్స్‌లో జరిగినట్లు జర్మనీలో అల్లర్లు జరగకుండా జాగ్రత్త పడాలని ప్రభుత్వం భావిస్తోంది.

