Turkey Earthquake: వరస భూకంపాలతో టర్కీ అతలాకుతలం అవుతోంది. రెండు వారాల క్రితం టర్కీలో వచ్చిన భూకంపం ధాటికి ఆ దేశంతో పాటు పక్కనే ఉన్న సిరియా కూడా తీవ్రంగా దెబ్బతింది. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన వరస భూకంపాలు టర్కీ దక్షిణ ప్రాంతంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 50,000 వేలను దాటింది. ఇప్పుడిప్పుడే పునరావాస చర్యలు, ఇళ్ల పునర్నిర్మాణం వేగం అవుతోంది.
READ ALSO: Antony Blinken: ఉక్రెయిన్ పై రష్యా అణ్వాయుధ దాడి చేయకుండా భారత్, చైనాలే అడ్డుకున్నాయి.
ఇదిలా ఉంటే మరోసారి టర్కీని భూకంపం వణికించింది. శనివారం సెంట్రల్ టర్కిష్ ప్రావిన్స్ నిగ్డేను భూకంపం తాకింది. 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు టర్కీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు వచ్చిన భూకంపాల వల్ల నష్టపోయిన 15 లక్షల ప్రజల కోసం టర్కీ కొత్త గృహాలను నిర్మించాలని పని ప్రారంభించిన శనివారమే మరో భూకంపం వచ్చింది. ఫిబ్రవరి 6న వచ్చిన భూకంపాల వల్ల 5 లక్షల అపార్ట్మెంట్లు కలిగిన లక్షల భవనాలు కూలిపోయాయి. భూకంపం వల్ల టర్కీలో 44,218 మంది, సిరియాలో 5,914 మంది మరణించారు.
కొన్ని నెలల్లో టర్కీలో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ ఒక ఏడాదిలోనే గృహాలను పునర్నిర్మించాలని అనుకుంటున్నాడు. అయితే ఈ చర్యలకు వరసగా వస్తున్న భూకంపాలు, భూప్రకంపనలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 6 తర్వాత భారీ భూకంపాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 1000కి పైగా ప్రకంపనలు టర్కీలో చోటు చేసుకున్నాయి. ఈ విపత్తులో అన్నీ కోల్పోయిన ప్రజలు ప్రస్తుతం గుడారాల్లో కాలం వెల్లదీస్తున్నారు.