Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్‌లో అమెరికా CIA కుట్ర.. హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు..

Bangladesh

Bangladesh

Bangladesh: గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయ్యారు. అయితే, షేక్ హసీనా ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ సంచలన ఆరోపణలు చేశారు. హసీనాను పదవి నుంచి దించడానికి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కూడా సహాయం చేశారని అన్నారు. అమెరికా సీఐఏ ఈ మొత్తం కుట్రకు పాల్పడిందని, వకార్ కూడా ఇందులో భాగమే అని ఆయన అన్నారు.

డీప్ హాల్డర్, జైధీప్ మజుందార్, సాహిదుల్ హసన్ ఖోకాన్ రాసిన ‘‘ఇన్షా అల్ల బంగ్లాదేశ్: ది స్టోర్ ఆఫ్ ఆన్ అన్‌ఫినిష్డ్ రివల్యూషన్’’ పుస్తకం త్వరలో విడుదల కాబోతోంది. ఈ పుస్తకంలోని వాదనలను ఇప్పటికే బంగ్లాదేశ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. హసీనాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన అసదుజ్జామాన్ జూన్ నెలలో ఢిల్లీ హోటల్‌లో జరిగిన సంభాషణల్లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆర్మీ చీఫ్ హసీనాకు వెన్నుపోటు పొడిచాడని, వకార్ ఉజ్ జమాన్ గురించి హెచ్చరించడంలో బంగ్లాదేశ్ నిఘా సంస్థలు వైఫల్యమయ్యాయని ఆరోపించారు. వకార్ సీఐఏ పేరోల్‌లో ఉన్నారని అన్నారు.

Read Also: Indelible Election Ink: ఎన్నికల్లో చెరగని ‘సిరా’ చరిత్ర తెలుసా..!

షేక్ హసీనాను గద్దె దించడానికి రెండు కారణాలు ఉన్నాయని కమాల్ చెప్పారు. దక్షిణాసియాలో మోడీ, జిన్‌పింగ్, షేక్ హసీనా లాంటి బలమైన నేతలు ఉన్నప్పుడు సీఐఏకి పని కష్టమవుతుందని అమెరికా ఎప్పుడూ బలహీనమైన ప్రభుత్వాలనే కోరుకుంటుందని చెప్పారు. రెండోది ‘‘సెయింట్ మార్టిన్’’ ద్వీపం అని చెప్పారు. ఈ ద్వీపం గురించి హసీనాపై అమెరికా ఒత్తిడి తీసుకువచ్చిందని చెప్పారు. దీనిని హసీనా అమెరికాకు అప్పగిస్తే సమస్యలు లేకుండా చూస్తామని చెప్పారని వెల్లడించారు. ఈ ద్వీపం కోసం అమెరికా కుట్ర చేసిందని అన్నారు.

ప్రస్తుతం, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ పై బంగ్లాదేశ్‌లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఆదేశాలతో 15 మంది ఆర్మీ అధికారుల్ని అరెస్ట్ చేశారు. నిజానికి హసీనానే వాకర్‌ని స్వయంగా నియమించారు. కానీ చివరకు ఆమెకే వ్యతిరేకంగా వ్యవహరించాడని అన్నారు. కమాల్ మాట్లాడుతూ.. అభిమన్యుడిలా హసీనాను అన్ని వైపులు చుట్టుముట్టారని, వాకర్ బంగ్లాదేశ్‌లోని మతఛాందసవాదులతో చేతులు కలిపాడని, పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఇందులో భాగస్వామిగా ఉందని ఆయన ఆరోపించారు. హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జమాతే ఇస్లామి మార్గదర్శకత్వంలో కలిసి పనిచేశారని అన్నారు.

ఐఎస్ఐ ప్రమేయం గురించి తాను హసీనాను హెచ్చరించానని, అయితే వాకర్ ఈ వాదనల్ని తోసిపుచ్చారని కమాల్ అన్నారు. జమాత్, ఐఎస్ఐలో శిక్షణ పొందిన వారు విద్యార్థి ఉద్యమంలోకి చొరబడ్డారని తనకు పోలీసులు చెప్పారని, ఇదే విషయాన్ని హసీనాకు చెప్పానని, కానీ వకార్ ఈ ఉద్యమాన్ని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారని కమాల్ గుర్తు చేశారు. హసీనాకు, తనకు సైన్యం రక్షణ ఇస్తుందని వకార్ హామీ ఇచ్చిందని, ప్రధాన మంత్రి నివాసానికి ఎవర్ని అనుమతించమని వకార్ చెబితే ఆయనను నమ్మిందని అన్నారు. చివరకు మరుసటి రోజు పెద్ద ఎత్తున ఆందోళనకారులు చుట్టుమట్టడంతో ఆమె బంగ్లాదేశ్ వదిలి రావాల్సి వచ్చింది.

Exit mobile version