Site icon NTV Telugu

China Floods: చైనాను ముంచెత్తిన వరదలు.. 30 మంది మృతి

China Floods

China Floods

China Floods: భారీ వర్షాలు, వరదలు ఇండియాతోపాటు పలు దేశాలను ఇబ్బంది పెడుతున్నాయి. రుతుపవనాల ప్రభావం ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వరదలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టాయి. అలాగే భారీ వర్షాలు, వరదలు చైనాను అతలాకుతలం చేశాయి. ఇప్పటి వరకు చైనాలో వరదల కారణంగా 30 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఒక్క ఆదివారమే 14 మంది మృతి చెందారని తెలిపారు. చైనాలో వర్షాలు వరదల కారణంగా ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయని దేశం అంచనా వేస్తోంది. చైనాలోని ఈశాన్య ప్రాంతం వరదల్లో మునిగిపోవడంతో ఆహార ధాన్యాల సాగు దెబ్బతింది. పొలాల్లోకి భారీగా వరద నీరు నిలిచిపోయింది.

Read also: Bolla Brahma Naidu: లోకేష్‌కు దమ్ముంటే వినుకొండలో పోటీ చేసి నాపై గెలవాలి..

టైఫూన్‌ డోక్సూరి దెబ్బకు జులై నుంచి భారీగా వర్షపాతం నమోదైంది. బీజింగ్‌ హెబెప్రావిన్స్‌లో దాదాపు 30 మంది మరణించారు. జిలిన్‌ ప్రావిన్స్‌లోని షులాన్‌ నగరంలో ఒక్క ఆదివారమే దాదాపు 14 మంది మరణించారు. వారిలో నగర డిప్యూటీ మేయర్‌ సహా ముగ్గురు అధికారులు కూడా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారంతా వరద సహాయక చర్యల సమయంలో వరద నీటిలో కొట్టుకుపోయినట్టు అధికారులు ప్రకటించారు. వరి పంటకు పేరున్న ఉత్తర చైనాలోని హెలాంగ్జియాంగ్‌ ప్రావిన్స్‌లో నదులు పొంగి పొర్లుతుండటంతో పొలాలు మొత్తం నీట మునిగిపోయాయి. కూరగాయలు పండించే గ్రీన్‌హౌస్‌లు కూడా చాలా చోట్ల నీటిలో తేలియాడుతున్నాయి. ఈ ప్రావిన్స్‌లోని 25 నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రావిన్స్‌ రాజధాని హార్బిన్‌లో దాదాపు 1.6లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు ప్రకటించగా.. 90వేల హెక్టార్లలో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. వాటితోపాటు షాంఝీలో 42వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని అధికారికంగా ప్రకటించారు. దేశంలోని కీలకమైన సాగుభూములు వరదనీటిలో మునిగిపోవడంతో.. ఈ సారి చైనాలో ఆహార కొరత ఏర్పడవచ్చని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత వారం చైనా వ్యవసాయ శాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. అందులో భాగంగా దేశ వ్యవసాయోత్పత్తిపై భారీగా ప్రతికూల ప్రభావం పడనుందని హెచ్చరించింది. భారీగా ఆహార ధాన్యాలను పండించే హెనాన్‌ ప్రావిన్స్‌లో మే నెలలో పడిన వర్షాలు ఎక్కువ మొత్తంలో పంటలను దెబ్బతీశాయని అధికారులు ప్రకటించారు.

Exit mobile version