Finland joins NATO military alliance: నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(నాటో) సైనిక కూటమిలో ఫిన్లాండ్ సభ్యదేశంగా చేరింది. అమెరికా నేతృత్వంలోని ఈ కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరబోతోంది. మరో స్కాండనేవియన్ దేశం స్వీడన్ ఈ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రక్షణ కోసం ఈ రెండు దేశాలు నాటోలో చేరేందుకు మొగ్గు చూపాయి. తాజాగా ఫిన్లాండ్ చేరికతో నాటో ఆధిపత్యం రష్యాకు మరింత సమీపంలోకి వచ్చినట్లు అయింది.
నాటోలో సభ్యదేశాలు అయిన హంగేరీ, టర్కీలు మొదటగా సొంత కారణాల వల్ల ఫిన్లాండ్ నాటో చేరేందుకు మొదట ససేమిరా అన్నాయి. ఆ తరువాత రెండు దేశాలు మొత్తబటడంతో ఫిన్లాండ్ కూటమిలో చేరికకు మార్గం సుగమం అయింది. కేవలం ఏడాది కాలంలోనే అత్యంత వేగవంతం అయిన సభ్యత్వ ప్రక్రియ ద్వారా ఫిన్లాండ్ నాటో భాగం అయింది. నాటో వ్యవస్థపాక దేశంగా ఉన్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ కు ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి అధికారిక ప్రవేశపత్రాలను అందచేయనున్నారు.
ఫిన్లాండ్ నాటో చేరిన తర్వాత చారిత్రాత్మకమైన రోజుగా నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ అభివర్ణించారు. నాటోలో ఫిన్లాండ్ చేయడం వల్ల ఈ దేశంపై దాడి జరిగితే సభ్యదేశాలపై దాడిగా పరిగణిస్తుంది. నాటోను బలహీనపరచాలనే ఉద్దేశ్యంతోనే పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగాడని, అయితే అందుకు విరుద్ధంగా నాటో విస్తరిస్తోందని ఆయన అన్నారు. రష్యాతో ఫిన్లాండ్ 1300 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. ప్రచ్ఛన్న యుద్ధం అంతటా నాటోకు ఫిన్లాండ్ దూరంగానే ఉంది. అయితే రష్యా, ఉక్రెయిన్ పై దాడి చేయడంతో భయపడిన సరిహద్దు దేశాలు నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. సోవియట్ యూనియన్ గా రష్యా ఉన్న సమయంలో 1949లో నాటో ఏర్పడింది. ఫిన్లాండ్ సభ్యదేశంలో చేరడంతో స్వీడన్ కూడా త్వరలో సభ్యదేశంగా మారేందుకు ఎదురుచూస్తోంది.
