Food vlogger: వ్యూస్ కోసం ‘‘డెవిల్ క్రాబ్’’ను తిన్న ఫుడ్ వ్లాగర్.. చివరకు..

  • వ్యూస్ కోసం ప్రాణాలు పణం..
  • విషపూరిత ‘‘డెవిల్ క్రాబ్’’ తిని ఫుడ్ వ్లాగర్ మృతి..
Emma Amit

Emma Amit

Food vlogger: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఒక ఫుడ్ వ్లాగర్ ప్రాణాలు పోగొట్టుకుంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన 51 ఏళ్ల ఫుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఎమ్మా అమిట్ వ్యూస్ కోసం అత్యంత విషపూరితమైన ‘‘డెవిల్ క్రాబ్’’ను తినడంతో ఆమె మరణించారు. విషపూరితమైన పీతను తిన్న కొన్ని గంటల్లోనే ఆమె మృతి చెందారు. ఫిబ్రవరి 04న ప్యూర్టో ప్రిన్సెసా దగ్గర ఉన్న మడ అడవుల్లో ఆమె తన స్నేహితులతో కలిసి షెల్‌ఫిష్ సేకరించారు. డెవిల్ క్రాబ్‌ను కొబ్బరిపాలతో వండుకుని, ఆ వంటకాన్ని తిన్నారు. ఈ వీడియో టిక్‌టాక్, ఫేస్‌బుక్‌లో రికార్డ్ చేశారు.

అయితే, తిన్న తర్వాత కొన్ని గంటలకే ఎమ్మా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె శరీరం వణకడం, పెడాలు నీలం రంగులోకి మారడం జరిగింది. వెంటనే స్పృహ కోల్పోయింది. ఆస్పత్రికి తరలించినా వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ గ్రామంలో ఉన్న వారికి ఈ పీతలు ప్రమాదకరమని తెలుసు, ఇంత అనుభవం ఉన్న ఎమ్మా ఎలా వీటిని తిన్నారో అర్థం కావడం లేదని చెప్పారు.

‘‘డెవిల్ క్రాబ్ లేదా టాక్సిక్ రీఫ్ క్రాబ్ ’’ ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పగడపు తీరంలో కనిపించే విషపూరితమైన జాతి. ఇది అత్యంత ప్రమాదకరమైన సాక్సిటాక్సిన్, టెట్రోడోటాక్సిన్ అనే న్యూరో టాక్సిన్లను కలిగి ఉంటుంది. పఫర్ ఫిష్‌లో కూడా ఇవే విషాలు ఉంటాయి. వండిన తర్వాత కూడా ఈ విషం పోదు. తిన్న వెంటనే కొన్నిగంటల్లో పక్షవాత, శ్వాస ఆగిపోవడం, మరణం కలుగవచ్చు. కొన్ని గంటల్లోనే ఈ పీతలోని విషాలు ప్రాణాంతకంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.