హమ్మయ్య.. మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవార్డు దక్కింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపి నాకు.. నోబెల్ శాంతి బహుమతి నాకు తప్ప ఇంకెవరికి వస్తుంది’’ అని భావించారు. కానీ చివరికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో తన్నుకుపోయారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది. దీంతో ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
ఏదైతే ఏమైంది కొంచెం ఆలస్యమైనా 2025లోనే ట్రంప్ తీపికబురు అందుకున్నారు. తాజాగా ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో.. తొలి ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్‌కు అందించబోతున్నట్లు ప్రకటించారు. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ట్రంప్‌కు అందజేయబోతున్నట్లు ఫిఫా అధ్యక్షుడు ప్రకటించారు. దీంతో ట్రంప్ చాలా సంతోషం వ్యక్తం చేశారు.
ఫిఫా శాంతి బహుమతి ఉద్దేశం ఇదే..
ఈ ఏడాది నుంచే ఫిఫా శాంతి బహుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు నవంబర్ 5న ప్రపంచ ఫుట్‌బాల్ బాడీ అయిన ఫిఫా ప్రకటించింది. శాంతి కోసం అసాధారణమైన.. అసాధారణమైన చర్యలు తీసుకున్న వ్యక్తులకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచ శాంతి కోసం తీవ్రంగా శ్రమించే వారికి ఈ బహుమతులు అందజేస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా ఈ ఏడాది తొలి ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు ప్రకటించారు. వచ్చే ఏడాది వేసవిలో జరిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభ సమయంలో ఈ అవార్డును ట్రంప్‌కు అందజేయనున్నారు.
ట్రంప్ సంతోషం..
అవార్డు ప్రకటన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. నిజంగా ఇది తన జీవితంలో లభించిన గొప్ప గౌరవాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అయినా అవార్డులకు మించి.. లక్షలాది మంది ప్రాణాలను కాపాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
విమర్శలు..
అయితే అవార్డు ప్రకటనపై దుమారం చెలరేగింది. అవార్డు ఏకపక్షంగా ప్రకటించారంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తం 37 మంది సభ్యుల పాలక బోర్డు అయిన ఫిఫా కౌన్సిల్ అనుమతి లేకుండానే ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో ప్రకటించారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
