Site icon NTV Telugu

Google: ఈ ఏడాది గూగుల్ లో ప్రమోషన్లు తక్కువే.. తాజా నివేదికలో వెల్లడి..

Google.jpg 2

Google.jpg 2

Google: ఐటీ ఇండస్ట్రీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడుతాయో తెలియడం లేదు. వరసగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది గూగుల్ సంస్థల్లో కొద్ది మందికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయని సీఎన్బీసీ నివేదిక వెల్లడించింది. సీనియర్లుగా ప్రమోషన్లు తగ్గుతాయని గూగుల్ ఇప్పటికే ఉద్యోగులకు తెలిపినట్లు సమాచారం.

ఎల్ 6, ఆపై స్థాయిలకు తక్కువ ప్రమోషన్లు ఉంటాయని తెలుస్తోంది. ఎల్ 6 అనేది సీనియర్ గా పరిగణించే మొదటిస్థాయి ఉద్యోగులను సూచిస్తుంది. సాధారణంగా వీరు పదేళ్ల సీనియారిటీ కలిగి ఉంటారు. ఉద్యోగుల పనితీరు అంచనా వేయడానికి గూగుల్ రివ్యూస్ అండ్ డెవలప్మెంట్(జీఆర్ఏడీ) అమలు తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సిస్టమ్ ప్రకారం చాలా మంది ఉద్యోగులు తక్కువ పనితీరున రేటింగ్ సాధించారు. కొందరు మాత్రమే మంచి రేటింగ్ సాధించారు.

Read Also: Robbery : వారెవ్వా, ఎంత షార్ప్ గా రూ.40లక్షలు కొట్టేశారు

కంపెనీ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ ప్రకటన వచ్చింది. కంపెనీ వృద్ధికి అనుగుణంగా సీనియర్ల ప్రమోషన్లు ఉంటాయని నిర్థారించడానికి, తక్కువ మందిని సీనియర్లుగా ప్రమోట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మీరు ప్రమోషన్లు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని మీ మేనేజర్లు భావిస్తే వారు మిమ్మల్ని నామినేట్ చేస్తారని సోమవారం కంపెనీ పంపిన ఈమెయిల్ లో పేర్కొంది.

ఈ ఏడాది జనవరిలో గూగుల్ 12,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగులను ఇళ్లకు పంపింది గూగుల్. ఇతర దేశాల్లో ఈ తొలగింపుకు సమయం పట్టనుంది. భారతదేశంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న 450 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయం తగ్గడంతో ఖర్చులను ఆదా చేసుకునేందుకు అన్ని ఐటీ కంపెనీలు భావిస్తున్నట్లే గూగుల్ కూడా తన ఉద్యోగులపై వేటు వేస్తోంది.

Exit mobile version