NTV Telugu Site icon

TV journalist: బంగ్లాదేశ్ టీవీ జర్నలిస్టు అనుమానాస్పద మృతి

Bangladheshtvjournalist

Bangladheshtvjournalist

బంగ్లాదేశ్‌లో మహిళా టీవీ జర్నలిస్ట్ సారా రహ్మునా(32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రాజధాని ఢాకాలోని హతిర్‌జీల్ సరస్సు నుంచి బుధవారం ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. సారా…  గాజీ టీవీలో న్యూస్‌రూమ్ ఎడిటర్‌గా పనిచేస్తోంది. మృతదేహాన్ని ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తెల్లవారుజామున 2:00 గంటలకు ఆమె చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించారు.

తెల్లవారుజామున హతిర్‌జీల్ సరస్సులో తేలియాడుతున్న మహిళను చూసి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు సాగర్ అనే వ్యక్తి తెలిపాడు. అనంతరం ఆమెను డీఎంసీహెచ్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె మరణానికి ముందు.. మంగళవారం రాత్రి తన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేసింది.

‘‘నీలాంటి స్నేహితుడిని కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూస్తాడు. త్వరలో నీ కలలన్నీ నెరవేరుతాయి. కలిసి చాలా ప్లాన్ చేసుకున్నామని నాకు తెలుసు. కానీ వాటిని నెరవేర్చలేకపోతున్నందుకు నన్ను క్షమించు’’ అని ఆమె రాసింది. అంతకముందు పోస్ట్‌లో.. ‘‘చావుతో సమానమైన జీవితాన్ని గడపడం కంటే చనిపోవడం ఉత్తమం.’’ అని రాసింది.

మృతదేహాన్ని డీఎంసీహెచ్ మార్చురీలో ఉంచినట్లు ఇన్‌స్పెక్టర్ బచ్చు మియా తెలిపారు. ఆమె మృతికి గల కారణాలపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. అయితే సారా మరణంపై మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ మరణానికి రాజకీయ రంగు పులుముతూ దేశంలో భావప్రకటనా స్వేచ్ఛపై ‘‘మరో క్రూరమైన దాడి’ అని పేర్కొన్నారు.