బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 7గంటలకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉప ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. పోలింగ్ కు 72 గంటల ముందు నుంచే ఈ ప్రచారాలు ముగియడంతో మైకులు మూగబోయాయి. అయితే ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామారాజు, ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. బద్వేల్ నియోకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అంతేకాకుండా ఈ పోలింగ్ కోసం 1,124 మంది సిబ్బందితో పాటు భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రచారం సమయం ముగిసిన తరువాత స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండరాదని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిసినా సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవలసిందిగా కోరారు.