భూమిపై మరో శాటిలైట్ కుప్పకూలేందుకు సిద్ధం అవుతోంది. 1360 కిలోల శాటిలైట్ భూమిపై క్రాష్ కానుంది. యూరప్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన ‘‘ఏయోలస్’’ కృత్రిమ ఉపగ్రహం జీవితకాలం చివరి అంకానికి చేరుకుంది. 320 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగున్న ఈ అంతరిక్ష నౌక వేగంగా తన ఇంధనాన్ని కోల్పోతోంది. దాదాపుగా దాని ఇంధన నిల్వలు క్షీణించాయి. అయితే ఉపగ్రహానికి సంబంధించిన లేజర్ పరికరాలు ఇంకా పనిచేస్తున్నాయి. ఈ శాటిలైట్ కు చెందిన సైన్స్ పరికరాలను ఏప్రిల్ 30న నిలిపేశారు.
Read Also: Lithium: జమ్మూకాశ్మీర్ తర్వాత రాజస్థాన్‌లో బయటపడిన లిథియం నిల్వలు.. చైనా గుత్తాధిపత్యానికి దెబ్బ
ఎర్త్ ఎక్స్‌ప్లోరర్ రీసెర్చ్ మిషన్ కింద ఏయోలస్ శాటిలైట్ ను ఐదేళ్ల క్రితం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. ప్రస్తుతం దానిలోని ఇంధనం పూర్తిగా క్షీణించింది. 320 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఏయోలస్ ఇప్పటికే భూమి పలుచని వాతావరణంలోకి ఎంట్రీ ఇచ్చింది. భూమి గురుత్వాకర్షణ శక్తి నెమ్మదిగా దీన్ని లాగేసుకుంటోంది. దీంతో పాటు సూర్యుడి నుంచి వచ్చే ప్లాస్మా తరగంగాలు భూమి వైపుగా దీన్ని మరింతగా నెడుతున్నాయి. ఇటీవల తీవ్రమైన సూర్యుడి కార్యకలాపాల వల్ల ఏయోలస్ ఎక్కువగా ఇంధనాన్ని వినియోగించాల్సి వచ్చింది.
రాబోయే కొన్ని నెలల్లో దీని ఎత్తున 320 కిలోమీటర్ల నుంచి క్రమంగా 280 కిలోమీటర్లకు, ఆ తరువాత 150 కిలోమీటర్లకు తగ్గించబడుతుంది. శాటిలైట్ 80 కిలోమీటర్ల కిందకు దిగగానే భూ వాతావరణ ఘర్షణ కారణంగా ఆకాశంలోనే కాలి బూడిద అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే శాటిలైట్ భూవాతావరణంలోకి ‘రీఎంట్రీ’ అయ్యే సమయం తక్కువగా ఉందని, సూర్యుడి కార్యకలాపాలు ఈ ప్రక్రియను మరింత వేగం చేసే అవకాశం ఉందని, ఈ కార్యకలాపాల వల్ల తుది తేదీ ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆగస్టు చివరిలోపు ఏయోలస్ క్రాష్ అవుతుందని భావిస్తున్నారు. ముక్కలు ముక్కులగా విడిపోయే దీని భాగాలను సముద్రంలో పడేలా చేస్తున్నారు శాస్త్రవేత్తలు.