NTV Telugu Site icon

Elon Musk: “నా చిన్నతనంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉండేది”.. మస్క్ కీలక వ్యాఖ్యలు..

Elon Musk

Elon Musk

Elon Musk: ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే నెంబర్ వన్ 1 బిలియనీర్. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్, న్యూరాలింక్ ఇలా టెక్ మొగల్‌గా ఉన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే తన బాల్యం అనుకున్నంత సంతోషంగా ఏం లేదని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ ఏడాది మేలో ఒక ట్వీట్‌లో తన బాల్యంలో అనుభవించిన బాధల్ని పంచుకున్నారు. 1989కి ముందు తాను సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌లో నివసించేవాడినని వెల్లడించారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో జరిగిన ఇంటర్వ్యూలో మరోసారి తన గతం గురించిన అనుభవాలను పంచుకున్నారు. తాను చిన్నతనంలో ఎదుర్కొన్న అనుభవాలను చెప్పారు.

తన ప్రారంభ సంవత్సరాల్లో ‘అస్తిత్వ సంక్షోభం’ చుట్టుముట్టడాన్ని వివరించారు. జీవితానికి అర్థం ఏమిటి..? అవన్నీ అర్థరహితం కాదా..? ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదు..? ఎందుకు ఉన్నాను..? అని తరుచుగా తనను తాను ప్రశ్నించుకున్నానని వెల్లడించారు. ప్రపంచంలో ప్రముఖ బిలియనీర్, సక్సెస్ ఫుల్ టెక్ దిగ్గజంగా ఉన్న ఎలాన్ మస్క్ మరో కోణాన్ని వెల్లడించారు.

Read Also: Snake Video: షూస్ వేసుకునే ముందు జాగ్రత్త.. ఎందుకు తెలుసా..! వీడియో చూడండి

మస్క్‌కి చెందిన ఆటోబయోగ్రఫీలో అతని చిన్ననాటి పోరాటాలను గురించి చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్రను రాసిన అమెరికన్ జర్నలిస్ట్ వాల్టర్ ఐజాక్సన్, మస్క్ బయోగ్రఫీని రాశారు. దక్షిణాఫ్రికాలో మస్క్ ఎదుర్కొన్న సంఘర్షణను ఇందులో వెల్లడించారు. మస్క్ చిన్నప్పుడు పాఠశాలలో వేధింపులకు గురయ్యాడని, ఒక విద్యార్థి మస్క్ తలపై తన్నడంతో మెట్లపై నుంచి పడిపోవడాన్ని ఇందులో ప్రస్తావించారు. దక్షిణాఫ్రికాలో పెరగడంతో మస్క్ నొప్పిని ఎలా ఎదుర్కోవాలనేది నేర్చుకున్నాడంటూ పేర్కొన్నాడు.

మస్క్ తండ్రి ఎర్రోల్, తల్లి మాయే వివాహం కూడా సంతోషంగా లేదని, తరుచూ పిల్లల ముందు గొడవ పడేవారని ఐజాక్సన్ పేర్కొన్నారు. 12 ఏళ్ల వయసులో మస్క్ సర్వైవల్ క్యాంప్‌కి వచ్చాడనేది కూడా పుస్తకంలో వివరించారు. ఈ క్యాంపులో ఇతర పిల్లల కన్నా మస్క్ చిన్నవాడని, రెండుసార్లు మస్క్‌ని క్యాంపులో కొట్టారని పుస్తకంలో పేర్కొన్నారు.