Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్‌కు భారీ దెబ్బ.!

  • 600 బిలియన్ డాలర్లు ఆవిరైన మస్క్ సంపద స్పేస్‌ఎక్స్, టెస్లా షేర్ల పతనంతో భారీ నష్టం టెస్లా ఫలితాలు మార్కెట్‌ను నిరాశపరిచాయి నష్టాల మధ్య AI, రోబోటిక్స్‌పై మస్క్ ఫోకస్
Elon Musk

Elon Musk

ప్రపంచ బిలియనీర్, టెస్లా , స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు గడిచిన నెల రోజులు తీవ్ర ప్రతికూలతలను మోసుకొచ్చాయి. ఊహించని పరిణామాల మధ్య ఆయన నికర సంపదలో సుమారు 600 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 57 లక్షల కోట్లు) భారీ కోత పడింది. స్టాక్ మార్కెట్‌లో స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది.

‘ట్రిలియనీర్’ నుండి ఊహించని పతనం

గత జూన్ 16 నాటికి ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ 1.33 ట్రిలియన్ డాలర్ల రికార్డు రికార్డు స్థాయికి చేరింది. ఆ సమయంలో స్పేస్‌ఎక్స్ మార్కెట్ దూకుడుతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న ‘తొలి ట్రిలియనీర్‌’గా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే, ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. నెల రోజులు గడిచేసరికి ఆయన మొత్తం సంపద 684 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ సంపద తగ్గుదల ఎంత దారుణంగా ఉందంటే, ప్రపంచంలోని ఇతర బిలియనీర్ల మొత్తం ఆస్తుల కంటే కూడా మస్క్ కోల్పోయిన నష్టమే ఎక్కువ కావడం గమనార్హం.

స్పేస్‌ఎక్స్ ఐపీఓ.. ఊరించిన జోరు, వెంటాడిన పతనం

ఈ సంపద కరిగిపోవడానికి ప్రధాన కారణం స్పేస్‌ఎక్స్ షేర్లలో వచ్చిన పతనమేనని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా 75 బిలియన్ డాలర్లను సమీకరించిన స్పేస్‌ఎక్స్, ఇష్యూ ధర $135 కంటే మెరుగ్గా $150 వద్ద లిస్ట్ అయింది. లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఉత్సాహంతో కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే షేరు ధర 50 శాతం పైగా పెరిగి, జూన్ 16న $202 గరిష్ట స్థాయిని తాకింది. కానీ ఆ తర్వాతే అంచనాలు తలకిందులయ్యాయి. అప్పటి నుండి షేరు విలువ ఏకంగా 46 శాతం మేర పతనమై $108.37 వద్దకు చేరుకుంది. ఫలితంగా మస్క్ ఆస్తిలో వందల బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి.

లాభాల అంచనాలు అందని ‘టెస్లా’

ఒకవైపు స్పేస్‌ఎక్స్ దెబ్బకొడితే, మరోవైపు టెస్లా షేర్ల బలహీనత మస్క్‌పై మరింత ఒత్తిడిని పెంచింది. జూలై 22న ప్రకటించిన రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాల తర్వాత టెస్లా కంపెనీ షేర్లు ఏకంగా 17 శాతం మేర కుప్పకూలాయి. గత రెండేళ్లలో తొలిసారిగా టెస్లా తన లాభాల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. వాహనాల డెలివరీ రేటు పెరిగినప్పటికీ, కార్ల సగటు విక్రయ ధరలు తగ్గడం , కొత్త సాంకేతికతలపై పెట్టిన వ్యయం పెరగడంతో కంపెనీ లాభాలపై తీవ్ర ప్రభావం పడింది.

తగ్గని మస్క్ విజన్: ఏఐ, రోబోటిక్స్‌పై మరింత దూకుడు

స్వల్పకాలికంగా ఈ స్థాయి ఆర్థిక నష్టాలు, మార్కెట్ ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ ఎలాన్ మస్క్ తన భవిష్యత్ వ్యూహాల విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ, రోబోట్యాక్సీలు , హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిపై తన దృష్టిని మరింత తీవ్రతరం చేశారు.

ఈ అత్యాధునిక టెక్నాలజీని మెరుగుపరచడానికి ఈ ఒక్క ఏడాదే 25 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది గతేడాది పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. నష్టాలు ఎదురవుతున్నా భవిష్యత్తు సాంకేతికతపై మస్క్ చూపుతున్న ఈ ఆత్మవిశ్వాసం బిజినెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.