NTV Telugu Site icon

Elon Musk: “నాపై రెండుసార్లు హత్యాయత్నం”.. ట్రంప్‌ హత్యాయత్నం నేపథ్యంలో మస్క్ సంచలన ఆరోపణలు..

Musk

Musk

Elon Musk: డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయం సమీపంలో తుపాకులతో అరెస్టైన వ్యక్తుల సంఘటనను, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత మస్క్ భద్రతపై ఎక్స్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత మస్క్ ఎక్స్ వేదికగా ‘‘తనపై గత 8 నెలల్లో రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయని’’ వెల్లడించారు.

Read Also: Home Minister Anitha: యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ని పరామర్శించిన హోం మంత్రి

మస్క్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఓ ఎక్స్ యూజర్ ‘‘ దయచేసి, మీ రక్షణ మూడు రెట్లు పెంచుకోంది. వారు ట్రంప్ కోసం రాగలిగితే, మీ కోసం కూడా వస్తారు’’ అని వ్యాఖ్యానించారు. దీనికి రిప్లైగా తనపై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నం జరిగిందని అన్నారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. నిందితుడు కాల్పులు జరిపిన సమయంలో బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది. దీంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనలో ట్రంప్ మద్దతుదారుల్లో ఒకరు మరణించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు నిందితుడిని కాల్చి చంపారు.

2022లో కూడా మస్క్ తాను హత్యకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ఎలాన్ మస్క్ తన మద్దతును రిపబ్లికన్‌లకు ప్రకటించారు. తాను ట్రంప్‌కి పూర్తి మద్దతు తెలియజేస్తున్నానని చెప్పారు. అతను త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ఈ ఘటనను అత్యంత అసమర్థ ఘటనగా అభివర్ణించారు. దీనికి బాధ్యతగా సీక్రెట్ సర్వీస్ అధిపతి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.