Magnetic reversal: సమస్త జీవావరణానికి భూమి ఆధారం. ప్రస్తుతం మనకు తెలిసిన విశ్వంలో భూమి మాత్రమే జీవులకు అనుకూలంగా ఉంది. భూమి మనకు తెలియకుండానే మనకు రక్షణ కల్పిస్తోంది. భూమి మధ్యలో కోర్ తిరగడం వల్ల భూమి చుట్టూ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది భూమిపైకి విశ్వం, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అణువులను, కాస్మిక్ కిరణాలను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భూమికి ఉండే ఈ అయస్కాంత క్షేత్రం సౌర తుఫానులు, సౌర జ్వాలల నుంచి జీవావరణాన్ని రక్షిస్తోంది. ఇది ఒక బుడగ మాదిరిగా భూమి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది.
Read Also: Loksabaha Elections 2024: ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ నామినేషన్ తిరస్కరణ..
ఇదిలా ఉంటే ప్రస్తుతం సైంటిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం.. భూమి అయస్కాంత ధృవాలు మారుతున్నాయని తెలుస్తోంది. ఇలా ఉత్తర, దక్షిణ ధృవాలు పరస్పరం మారుతున్నాయని బీబీసీ సైన్స్ ఫోకస్ వెల్లడించింది. 1990ల వరకు ఉత్తర ధృవం ఏడాదికి 15 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ రేటు ఏడాదికి 55 కిలోమీటర్ల మేర సైబీరియా వైపు పెరిగింది. ఈ కదలిక ఉత్తర, దక్షిణ ధృవాల స్థానాలను మార్చే ‘‘మాగ్నెటిక్ రివర్సర్’’కి దారి తీయవచ్చు. నాసా ప్రకారం.. 83 మిలియన్ ఏళ్లలో ఇది 183 సార్లు జరిగింది. అయితే, ఈ ప్రక్రియ మధ్య సమయాలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సగటున సుమారు 3,00,000 ఏళ్లకు ఒకసారి ఇలా మాగ్నెటిక్ రివర్సల్ చోటు చేసుకున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ జరిగే సమయంలో ఒకానొక దశలో ధృవాలు మారే సందర్భంలో మాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అవుతుంది.
అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే పరిస్థితి ఏంటి..?
భూమి యొక్క అయస్కాంత క్షేత్రం సమస్త జీవులను, సాంకేతిక వ్యవస్థలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అదృశ్య కవచం భూమి యొక్క అంతర్భాగం నుండి అంతరిక్షంలోకి విస్తరించి, ఒక రక్షిత బుడగను ఏర్పరుస్తుంది. సూర్యుని నుండి వెలువడే ఆవేశిత కణాల ప్రవాహం నుండి గ్రహాన్ని కాపాడుతుంది. అయితే ఈ కీలకమైన అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే? విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణం, సాంకేతికత దెబ్బతింటుంది. ప్రాణాంతక రేడియేషన్ భూమిని చేరుతుంది. తద్వారా జీవ కణాల మ్యుటేషన్ రేటు పెరుగుతుంది. జంతువుల్లో క్యాన్సర్‌లకు దారి తీస్తుంది. వాతావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. సౌర కుటుంబంలో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం అంగారకుడిపై కూడా నీరు ఉండేది. అయితే దానికి భూమిలా బలమైన అయస్కాంత క్షేత్రం లేకపోవడంతో ఈ గ్రహం ఇప్పుడు బంజేరు భూమిలా మారింది.