Site icon NTV Telugu

Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. 255 మంది మృతి!

Earthquake In Afghanistan

Earthquake In Afghanistan

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి కనీసం 255 మంది మృతిచెందినట్లు అఫ్గాన్‌ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వందల మంది గాయపడ్డారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. అఫ్గాన్‌లోని ఖోస్ట్‌ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.

భూకంపం ధాటికి భవనాలు కూలిపోయాయి.అర్ధరాత్రి సమయంలో పలుమార్లు ప్రకంపనలు చోటుచేసుకోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు పాకిస్థాన్‌, మలేషియాల్లో కూడా పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. పాక్‌లో పెషావర్‌, ఇస్లామాబాద్‌, లాహోర్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌లలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని పాక్‌ అధికారులు తెలిపారు. మలేషియా కౌలాలంపుర్​కు 561 కిలోమీటర్ల పశ్చిమాన భూమి కంపించింది. అర్ధరాత్రి 12:38 గంటలకు 5.61 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజి తెలపింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వీధుల్లోకి పరుగులు పెట్టారు.

Exit mobile version