Site icon NTV Telugu

Solar storm: గంటకు 21 లక్షల కి.మీ వేగంతో భూమిని ఢీకొన్న ‘‘సౌర తుఫాను’’.. ఏం జరిగిందంటే..

Solar Storm

Solar Storm

Solar storm: భూమి పైకి శక్తివంతమైన సౌర తుఫాను దూసుకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సెకనుకు 600 కి.మీ అంటే గంటకు సుమారుకుగా 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాను భూమిని ఢీకొట్టింది. దీని ప్రభావంతో భూమి ‘‘అయస్కాంత క్షేత్రం’’ తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు తెలిసింది. ఆగస్టు 20న సూర్యుడిపై ఉన్న AR 4199 చురుకైన ప్రాంతం నుంచి M2.7-క్లాస్ సౌర జ్వాల (solar flare) విడుదలైంది. దీని తర్వాత వెంటనే అనేక కరోననల్ మాస్ ఎజెక్షన్స్(CMEs) విడుదలయ్యాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసి అత్యంత ప్రమాదకరమైన కానిబల్ CMEగా మారాయి. ఇలా ఒకదానితో ఒకటి కలిసి పోవడంతో వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ సౌర తుఫానులు G1 (తక్కువ) నుండి G3 (బలమైన) స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 1న రాత్రి సమయంలో ఈ సౌర తుఫాను భూమిని ఢీకొట్టింది. వీటి ఫలితంగా ధ్రువాలకు సమీపంలో అరోరాలు కనిపించాయి. పవర్ గ్రిడ్స్, జీపీఎస్, కమ్యూనికేషన్ శాటిలైట్లు, హై ఫ్రీక్వెన్నీ రేడియో వ్యవస్థలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

Read Also: Ashok Gajapathi Raju: గోవాకు గవర్నర్‌గా వెళ్లడం నా అదృష్టం: అశోక్ గజపతి రాజు

భూమికి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఉండటంతో సూర్యుడి నుంచి వచ్చే ఛార్జ్డ్ పార్టికల్స్, ప్లాస్మాని తిప్పికొడుతుంది. శక్తివంతమైన సౌర తుఫాను వచ్చినప్పుడు భూమి అయస్కాంత క్షేత్రం ఒత్తిడికి గురవుతుంది. తాజాగా సంఘటనలో కూడా ఇదే జరిగింది. ఎర్త్ మాగ్నిటిక్ ఫీల్డ్ వల్ల సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదాలు భూమిపై ఉన్న జీవరాశులు తప్పించుకోగలుగుతున్నాయి.

ప్రస్తుతం సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్-25లో అత్యంత చురుకుగా ఉన్నాడు. ఈ సమయంలో సూర్యుడిపై భారీ విస్పోటనాలు సంభవిస్తున్నాయి. ఇవి 2025-26 నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు మారుతుంటాయి. ఈ సమయంలో సూర్యడి వాతావరణం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. భారీ గురుత్వాకర్షణ శక్తి కారణంగా సన్‌స్పాట్స్ ఏర్పడుతుంటాయి. వీటి నుంచి ఒక్కసారిగా పేలుళ్లు జరిగి అయస్కాంత క్షేత్రాలు, ప్లాస్మా సౌర కుటుంబంలోకి ఎగిసిపడుతుంది. ఇది ప్రయాణిస్తూ గ్రహాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.

Exit mobile version