పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాల్లో విమానాశ్రయాలు మూసేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే అర్ధాంతరంగా చిక్కుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో దుబాయ్ గుడ్‌న్యూస్ చెప్పింది. పరిమిత స్థాయిలో సర్వీసులు ప్రారంభించినట్లుగా ప్రకటించింది.
సోమవారం సాయంత్రం నుంచి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్ వరల్డ్ సెంట్రల్-అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DWC) నుంచి పరిమిత స్థాయిలో విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో పేర్కొంది.
ఎమిరేట్స్, ఎతిహాద్‌కు విమానాలు నడవనున్నాయి. ఆయా ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న ప్రయాణికులను స్వదేశాలకు తరలించనున్నారు. అన్ని విమానాలు రద్దైనప్పటికీ యూఏఈ అధికారుల సమన్వయంతో భద్రతా ప్రమాణాలకు కట్టుబడి పరిమిత స్థాయిలో సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు విమానాశ్రయాలు తెలిపాయి.
విమానాశ్రయ డేటా ప్రకారం.. సోమవారం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎతిహాద్ నడిచే అనేక ప్రత్యేక విమానాలు బయలుదేరాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థ అయిన ఎమిరేట్స్… దుబాయ్‌కు సాధారణ కార్యకలాపాలను మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నిలిపివేసింది. గురువారం వరకు అంతరాయాలు కొనసాగవచ్చని హెచ్చరించింది.
గత శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా భీకరదాడులు చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, కుటుంబ సభ్యులు హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు దేశాలైన గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. దీంతో గల్ఫ్ దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. మొత్తానికి సోమవారం సాయంత్రానికి పరిస్థితులు చక్కబడుతుండడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
