Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?

Donald Trump

Donald Trump

Trump China Visit: రెండు అగ్రదేశాల మధ్య ఈనెలలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకోబోతుంది. ఇంతకీ ఆ రెండు అగ్రదేశాలు ఏంటో తెలుసా.. ఒకటి అమెరికా అయితే మరొకటి చైనా. ఒక దేశం అగ్రదేశంగా వెలుగొందుతుంటే.. మరొక దేశం ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. ఆ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఇది నిజంగా నిజం.. ఈ విషయాన్ని స్వయంగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 13 నుంచి మే 15 వరకు చైనాలో అధికారిక పర్యటన చేయనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ మూడు రోజుల పర్యటనను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఉన్నత స్థాయి పర్యటనను చైనా వార్తా సంస్థ జిన్హువా ధృవీకరించింది. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కీలక ద్వైపాక్షిక సమస్యలపై వివరంగా చర్చిస్తారని సమాచారం. ఈ పర్యటన అంతర్జాతీయ వేదికపై బీజింగ్ – వాషింగ్టన్‌ల మధ్య ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాను హెచ్చరించిన చైనా..
గత నెలలో హోర్ముజ్ జలసంధిని అమెరికా నేవీ దిగ్బంధనం విధించడం, ఇరాన్‌తో చైనాకున్న ద్వైపాక్షిక సంబంధాలలో జోక్యం చేసుకోవడం వంటి వాటిపై ఒక సీనియర్ చైనా అధికారి అమెరికాను హెచ్చరించారు. ఈ హెచ్చరికలను చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మాకు ఇరాన్‌తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. ఇతరులు మా వ్యవహారాలలో జోక్యం చేసుకోరని ఆశిస్తున్నాము. హోర్ముజ్ జలసంధి చైనాకు తెరిచే ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హోర్ముజ్ జలసంధిని ట్రంప్ నేవీ దిగ్బంధించడంతో, ఈ కీలకమైన గల్ఫ్ జలమార్గంలో చైనాకు చెందిన నౌకలు ప్రయాణిస్తుంటే.. వాటిని ట్రంప్ నేవీ టార్గెట్ చేయవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటి మధ్యలో ట్రంప్ చైనా పర్యటన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారిందని చెబుతున్నారు.