Site icon NTV Telugu

Russia Ukraine War: జెలెన్‌ స్కీ గురించి ఈ విషయాలు తెలుసా?

రెండే రెండు పేర్లు ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగుతున్నాయి. ఒకటి పుతిన్‌.. రెండోది జెలెన్‌ స్కీ. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గురించి అందరికీ తెలుసు. రెండు దశాబ్దాలుగా ఆయన రష్యాను తిరుగులేకుండా పాలిస్తున్నారు. కానీ జెలెన్ స్కీ గురించే చాలా మందికి తెలియదు. నిజానికి, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగే వరకు ఆయన ఎవరో కూడా తెలియదు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు కావటానికి ముందు జెలెన్‌స్కీ ఒక బిజీ నటుడు. పలు సినిమాలు టీవీ సిరీస్‌లలో హాస్య పాత్రలు పోషించారు. జెలెన్‌ స్కీ నిర్మాతగా పలు ప్రాజెక్టులు చేశారు. ఆయన నటించిన టీవీ ధావాహిక ” సర్వెంట్ ఆఫ్ పీపుల్” ఉక్రెయిన్‌లో పెద్ద హిట్‌. పొలిటికల్ సెటైర్‌గా రూపొందిన ఈ టీవీ సిరీస్‌లో ఆయన దేశాధ్యక్షుడు అయ్యే హైస్కూల్ టీచర్ పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌ 2015-2018 మధ్య ప్రసారమైంది. ఆ మరుసటి సంవత్సరం ఆయన బుల్లి తెరమీదనే కాదు నిజ జీవితంలోనూ ఉక్రెయిన్ అధ్యక్షుడు అయ్యారు.

ప్రెసిడెంట్ కావడానికి ముందు జెలెన్‌ స్కీకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. సర్వెంట్ ఆఫ్ పీపుల్ టీవీ సిరీస్‌ సీరియల్ లో తన పాత్రకు లభించిన ఆదరణకు ప్రేరేపితుడై ఏకంగా రాజకీయ పార్టీ స్థాపించాడు. కేవలం కొన్ని నెలల వ్యవధిలో దేశానికి ప్రెసిడెంట్‌ కావటం విశేషం. నాటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకో పట్ల అప్పటికే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. అది జెలెన్‌ స్కీకి బాగా పనికొచ్చింది. అమెరికా తెరవెనక నుంచి ప్రజాందోళనలకు మద్దతిచ్చి జెలెన్‌స్కీని ప్రోత్సహించింది.

2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో జెలెన్‌స్కీ 73.22 శాతం ఓట్లు సాధించి ఉక్రెయిన్‌ అధ్యక్ష పీఠం అధిష్టించారు. ఆయన ప్రత్యర్థి రష్యా అనుకూల పొరోషెంకోకు కేవలం 24.46 శాతం ఓట్లు దక్కాయి. సంప్రదాయ ఎన్నికల ప్రచారానికి భిన్నంగా హాస్యం పడించే స్కిట్లతో జెలెన్‌స్కీ ఉక్రెనియన్ల మనస్సులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అధ్యక్ష పీఠం అధిష్టించే నాటికి ఆయన వయస్సు 41 ఏళ్లు.

జెలెన్‌ స్కీ రష్యా భాష మాట్లాడే యూదుడు. రష్యా కళలు, రష్యా సంస్కృతి అంటే తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించే ఉక్రెయిన్‌లో రష్యన్‌ భాష మాట్లాడే ఒక యూదు నటుడు అధ్యక్షుడు కావడం నిజంగా విశేషమే. 1978 జనవరి 25న యూదు తల్లిదండ్రులకు జెలెన్‌స్కీ జన్మించాడు. ఆయన తాత సైమన్‌ ఇవనోవిచ్‌ జెలెన్ స్కీ రష్యా రెడ్ ఆర్మీ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. 57వ గార్డ్స్ మోటార్ రైఫిల్ విభాగంలో సెమియోన్ తండ్రితో పాటు ఆయన ముగ్గురు సోదరులు హోలోకాస్ట్‌లో మరణించారు.

జెలెన్‌స్కీ న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు. ఆయన భార్య ఒలేనా ఆర్కిటెక్ట్. 2003లో వీరి వివాహం జరిగింది. ఉక్రెయిన్‌లోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఆమె ఒకరు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె . జెలెన్ స్కీపై అవినీతి ఆరోపణలు ఉన్నట్టు పండోర పేపర్ల ద్వారా వెల్లడయింది. ఆ డాక్యుమెంట్స్‌లోని అవినీతి నేతల జాబితాలో జెలెన్‌స్కీ పేరు కూడా ఉంది.

జెలెన్‌ స్కీ చిన్నతనంలో నాలుగేళ్ల పాటు మంగోలియాలోని ఎర్డెనెట్‌ నగరంలో గడిపారు. ఆయన తండ్రి సైబర్‌నెటిక్స్‌, కంప్యూటింగ్‌ హార్డ్‌వేర్‌ ప్రొఫెసర్‌. అక్కడే పని చేసేవాడు. దాంతో జెలెన్‌ స్కీ ప్రాధమిక విద్యాభ్యాసం ఆ నగరంలోనే సాగింది. జెనెస్కీ తల్లి కూడా ఇంజినీరే. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్ కావడానికి ముందు తాను ఒక టర్మ్ కోసమే పోటీ చేస్తున్నా అన్నారు. రెండోసారి అధ్యక్షుడిగా పోటీ చేస్తానని ఇప్పుడే చెప్పటం తొందరపాటు అవుతుందని 2021 మేలో ప్రకటిచాడు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య చాలా కాలంగా ఉన్న విబేధాలను పరిష్కరించాలని జెలెన్‌స్కీ అనుకున్నారు. కానీ ఇంతలోనే ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు యుద్ధం ప్రారంభం కావడం ఆయనకు అగ్నిపరీక్షగా మారింది.

Exit mobile version