NTV Telugu Site icon

Yahya Sinwar: సిన్వార్‌ని చంపుతూ హీరోని చేసిన ఇజ్రాయిల్.. వీడియో రిలీజ్ చేసి తప్పు చేసిందా..?

Sinvar

Sinvar

Yahya Sinwar: ఇజ్రాయిల్ మోస్ట్ వాంటెడ్ హమాస్ లీడర్, ఉగ్రసంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చింది. అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న సిన్వార్ గురించి గత దశాబ్ధ కాలం నుంచి ఇజ్రాయిల్ వెతుకుతోంది. అత్యంత రహస్యంగా గాజాలోని భూగర్భ టన్నెల్స్‌లో తన భార్య, పిల్లలతో నివాసం ఉండే సిన్వార్ చివరకు పిల్ల సైనికులు అంటే.. కేవలం ఇజ్రాయిల్ ఆర్మీలో 9 నెలల క్రితమే చేరిన 20 ఏళ్ల లోపు యువకుల చేతిలో హతమయ్యాడు.

సిన్వార్‌ని హతమార్చడంపై ఇజ్రాయిల్‌లో సంబరాలు మిన్నంటాయి. సిన్వార్ హత్య యుద్ధానికి అంతానికి తొలిమెట్టుగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అభివర్ణించారు. తమ బందీలను విడిచిపెడితే యుద్ధాన్ని ఆపేస్తామంటూ సందేశం పంపారు. ఇజ్రాయిల్‌లో సంబరాలు కొనసాగుతుంటే.. గాజాలో మాత్రం సిన్వార్ మరణం పట్ల విషాదం నెలకొంది. సిన్వార్ మరణం తర్వాత హమాస్ చీఫ్ పదవికి పోటీలో హమాస్ వ్యవస్థాపకుడు మరియు సీనియర్ సభ్యుడు మహమూద్ అల్-జహర్, యాహ్యా సోదరుడు మహ్మద్ సిన్వార్ ఉన్నారు.

సిన్వార్ మరణించడానికి ముందు ఇజ్రాయిల్ ఓ వీడియోను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఈ వీడియోని విడుదల చేసి తప్పు చేశామా..? అని ఇజ్రాయిల్ ఒకింత బాధపడుతోంది. శిధిలంగా మారిన ఒక బిల్డింగ్‌లో ఓ కుర్చీలో కూర్చున్న సిన్వార్, ఇజ్రాయిల్ డ్రోన్‌ పైకి ఒక కర్రను విసిరిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. అయితే, ఇప్పుడు ఈ వీడియోనే, ఇజ్రాయిల్ ధిక్కారానికి సిన్వార్ ప్రతిఘటన అనే రీతిలో ప్రచారం జరుగుతోంది. చాలా మంది గాజన్లు, హమాస్ మద్దతుదారులు ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా ఆయన చివరి చర్యగా గుర్తుంచుకున్నారు.

Read Also: Telangana: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ రూ.100కోట్ల విరాళం

జియోనిస్ట్(ఇజ్రాయిల్) ఆక్రమణకు వ్యతిరేకంగా అతని చివరి చర్య అని, అతడి మరణించి లెజెండ్ అయ్యారని జర్నలిస్ట్, చిత్ర నిర్మాత డాన్ కోహెన్ ట్వీట్ చేశారు. సిన్వార్ సొరంగాల్లో దాక్కుని మానవ కవచాలను ఉపయోగిస్తున్నాడనే ఇజ్రాయిల్ వాదనని డ్రోన్ చిత్రాలు తప్పని రుజువు చేశాయని కొందరు చెబుతున్నారు. సిన్వార్‌ని ఇజ్రాయిల్ సైన్యం పెట్రోలింగ్ సమయంలో అతడికి పెద్దగా భద్రత లేదు. సిన్వార్ తప్పించుకునేందుకు ఒక భవనంలోకి దూరడంతో, ఇజ్రాయిల్ బలగాలు దానిలోకి ఒక షెల్ ప్రయోగించి దాడి చేసింది. ఆ తర్వాత డ్రోన్‌ని పంపించి సిన్వార్ పరిస్థితిని క్యాప్చర్ చేసింది.

సిన్వార్‌ని ఇజ్రాయిల్ చంపుతూ.. అతడిని ‘‘అమరుడి’’గా మార్చిందని, అతడు నిజమైన యోధుడని, చివరి వరకు పోరాడుతూ అమరుడయ్యాడని కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. సిన్వార్ చివరి చిత్రాలు చాలా మంది గాజా ప్రజల్లో మరింత స్పూర్తిని రగిలిస్తుందనేది వాస్తవం. గాజాలో హమాస్ పట్ల మరింత మంది ఆకర్షితులయ్యేందుకు ఈ వీడియో సహకరిస్తుందని పలువురు భావిస్తున్నారు. దీంతో తాము ఈ వీడియోని రిలీజ్ చేసి తప్పు చేశామని ఇజ్రాయిల్ భావిస్తోంది.