ఓ వైపు కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా అమలైన మరణ శిక్షల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. 2020తో పోలిస్తే 2021లో మరణ శిక్షలు దాదాపుగా 20 శాతం పెరిగినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. 2021లో 18 దేశాలు 579 మరణ శిక్షలను విధించాయి అని వెల్లడించింది. 2020లో 246 మంది నుంచి 314 మందికి మరణశిక్షలు విధించారు.
ముఖ్యంగా ఇరాన్ లో గత నాలుగు సంవత్సరాల్లో మరణశిక్షల సంఖ్య పెరిగింది. సౌదీ అరేబియా కూడా 2020 నుంచి చూస్తే రెట్టింపు సంఖ్యలో మరణ శిక్షలను విధించింది. మయన్మార్ లో మార్షల్ లా కింద సుమారు 90 మందికి మరణ శిక్ష విధించినట్లు వెల్లడించింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. 2021లో మరణ శిక్షలు ఆందోళనకర రీతిలో పెరిగాయని వెల్లడించింది. 56 దేశాల్లో న్యాయమూర్తులు కనీసం 2052 మరణశిక్షలు విధించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. బంగ్లాదేశ్, భారతదేశం, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్ , పాకిస్తాన్‌లలో మరణ శిక్షల విధింపులో పెరుగుదల కనిపించినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే 2010 నుంచి చూస్తే 2021లో నమోదైన ఉరిశిక్షల సంఖ్యను పరిశీలిస్తే రెండో అతి తక్కువ అని తేలింది. చైనా, ఉత్తర కొరియా, వియత్నాం దేశాల్లో నమోదైన మరణ శిక్షల గురించి నివేదిక ప్రస్తావించలేదు. ఆయా దేశాల్లో గోప్యత కారణంగా ప్రస్తావించనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మయన్మార్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆమ్నెస్టీ వెల్లడించింది. అక్కడ పౌర కేసులను విచారించే అధికారం మిలటరీ ట్రిబ్యునల్ లకు ఉండటంతో అప్పీళ్లకు అవకాశం లేకుండా ఉంది. ఇటీవల సియోర్రా లియోన్ దేశం మరణ శిక్షను రద్దు చేసిన విషయాన్ని, మలేషియా మరణ శిక్షలపై సంస్కరణలు తీసుకువస్తున్నట్లు, కజఖ్ స్తాన్ కూడా మరణ శిక్షలు రద్దు చేసినట్లు నివేదిక పేర్కొంది. మరణ శిక్షలను పూర్తిగా రద్దు చేసిన రాష్ట్రంగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం నిలిచింది.