China-Taiwan Conflict: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి అయిన లై చింగ్-తే అధ్యక్షుడిగా విజయం సాధించడం డ్రాగన్ కంట్రీకి మింగుడుపడటం లేదు. లీ చింగ్-తే గెలిచినప్పటి నుంచి తైవాన్‌ని బెదిరించేందుకు చైనా ప్రకటనలు చేస్తోంది. చైనా హెచ్చరికలను ధిక్కరిస్తూ.. సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తీవ్రంగా శిక్షించబడుతుందని చైనా విదేశాంగ మంత్రి ఆదివారం హెచ్చరించారు.
Read Also: PM Modi: పొంగల్ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది..
వేర్పాటువాదిగా ముద్ర వేస్తూ.. లై చింగ్-తేకి తైవాన్ ప్రజలు ఓటేయవద్దని చైనా పిలుపునిచ్చినప్పటికీ, మరోసారి అధికార పార్టీకే అక్కడి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. వన్ చైనా విధానంలో తైవాన్ కూడా భాగమే అని చైనా వాదిస్తోంది. అయితే తైవాన్ ప్రజలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. అంతకుముందు లై చింగ్ గెలిచిన తర్వాత ఎన్నికల ఫలితాలు తైవాన్ పునరేకీకరణను అడ్డుకోలేవని, తైవాన్ చైనాలో భాగం కావడం అనివార్యం అంటూ తైవాన్ వ్యవహారాలను చూసే విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, తైవాన్ చైనాలో అంతర్భాగమనే ప్రాథమిక వాస్తవాన్ని వారు మార్చలేదు అని విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. తైవాన్ ద్వీపంలో ఎవరైనా స్వాతంత్య్రం కోసం ప్రయత్నిస్తే, వారు చైనాను విభజించేందుకు ప్రయత్నిస్తున్నట్లే.. వారు ఖచ్చితంగా కఠినంగా శిక్షించబడుతారు అని వాంగ్ యి ఈజిప్టు పర్యటనలో అన్నారు. తైవాన్ ఎప్పుడూ గతంలో కానీ, భవిష్యత్తులో ప్రత్యేక దేశం కాదు, ఇది చైనాలో భాగమని స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే అది తైవాన్ ప్రజల శ్రేయస్సుకు ప్రమాదకరమని.. చైనా ప్రాథమిక ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని, తైవాన్ జలసంధి ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని వాంగ్ యి హెచ్చరించారు.