Lightning Strike on Fuel Tank: లాటిన్ అమెరికా దేశం క్యూబాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చమురు నిల్వ కేంద్రంపై పిడుగుపాటుకు గురవ్వడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం ఒకరు మరణించగా.. 121 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 17 మంది అగ్నిమాపక సిబ్బంది తప్పిపోయారు. ఇంధన నిల్వ కేంద్రం చుట్టు పక్కల ఉన్న 1900 మందిని సురక్షితన ప్రాంతాలకు తరలించారు. క్యూబా రాజధాని హవానకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మతాంజాస్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్రమాదం సంభవించింది.
ఇంధన నిల్వ కేంద్రంలో 26,000 క్యూబిక్ మీటర్ల క్రూడ్ ఉన్న ట్యాంకుపై పిడుగుపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పాటు పక్కనే ఉన్న మరో ట్యాంకులో 52,000 క్యూబిక్ మీటర్ల క్రూడ్ ఆయల్ ఉంది. దీంతో మంటలు దానికి అంటుకుని పేలుడు సంభవించింది. అయితే ఈ మంటలను ఆర్పేందుకు ఇతర దేశాాల సహాయాన్ని కోరింది క్యూబా. ఇప్పటికే వెనుజులా, రష్యా, నికరాగ్వా, అర్జెంటీనా, చిలీ దేశాలతో పాటు యూఎస్ఏ కూడా సహాయం అందిస్తోంది. పిడుగు కారణంగా నిల్వ కేంద్రంలో ఉన్న క్యూడ్ మొత్తం అంటుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. రెండో పేలుడు సమయంలో సమీప ప్రాంతాల్లో షాక్ వేవ్ ధాటికి చాలా ఇళ్లు దెబ్బతినడంతో పాటు ప్రజలకు గాయాలయ్యాయి.
అయితే మెరుపులను అడ్డుకునే లైటెనింగ్ రాడ్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు క్యూబా అధికారులు వెల్లడించారు. క్యూబాలోని అతిపెద్దదైన అంటోనియో గిటెరస్ థర్మో ఎలక్ట్రిక్ ఫ్లాంట్ కు ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచే క్రూడ్ అయిల్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం దేశం తీవ్రమైన ఇంధన కొరత, విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 11 మిలియన్ల జనాభా కలిగిన క్యూబా ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో 12 గంటలకు పైగా విద్యుత్ కోతలు ఉన్నాయి. దీంతో ఇటీవల కాలంలో క్యూబాలో నిరసనలు మిన్నింటుతున్నాయి.
