Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?

Trump3

Trump3

Crude Oil Prices Fall: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై భారీ ప్రభావాన్ని చూపించాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ ప్రకటించడంతో, ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశాలపై ఆశలు పెరిగాయి. గత కొన్ని వారాలుగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హార్మూస్‌ జలసంధి మూసివేత భయాలు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూసివేయబడితే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో పరిస్థితి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, త్వరలో హార్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ఈ అంశంపై తన సలహాదారులతో చర్చలు కొనసాగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు.

100 డాలర్ల దిగువకు పడిపోయిన ముడి చమురు
డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా క్షీణించాయి. చాలా రోజుల తర్వాత తొలిసారిగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 92 డాలర్ల వరకు పడిపోయింది. గత వారం వరకు యుద్ధ భయాలతో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు శాంతి చర్చల వార్తలతో మార్కెట్‌లో ఊరట కనిపిస్తోంది.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
ముడి చమురు ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు కూడా భారీగా పెరిగాయి. బ్రిటన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలపై భారంగా మారాయి. భారతదేశంలో కూడా గత నాలుగేళ్లలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ, కేవలం 10 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేసింది.

చమురు కంపెనీలు ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నందున ధరలు పెంచాల్సి వచ్చిందని చెబుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు ఒక డాలర్ పెరిగితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 50 నుంచి 60 పైసల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మరింత తగ్గితే, రాబోయే రోజుల్లో ఇంధన ధరల్లో కూడా తగ్గుదల కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.