ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం తాలిబాన్ రాజ్యం నడుస్తోంది. తాలిబాన్ పాలనలో శిక్షలు ఘోరంగా ఉంటాయి. అందుకే ప్రజలు భయాందోళన చెందుతుంటారు. ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తాజాగా మహిళలకు వైద్య విద్యను తాలిబాన్ నిషేధించింది. నర్సింగ్, మిడ్‌వైఫరీ కోర్సులతో సహా వైద్య విద్యలో మహిళలు చేరకూడదని తాలిబాన్ ఆదేశించింది.
తాలిబాన్ తీసుకున్న నిర్ణయంపై క్రికెటర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు వైద్య విద్యను నిషేధించడం హృదయ విదారకమైనదని…తీవ్ర అన్యాయం అని ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ నబీ పేర్కొన్నాడు. అమ్మాయిలకు నేర్చుకునే అవకాశాన్ని.. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నిరాకరించడం దారుణం అన్నారు. వారి కలలకు, దేశ భవిష్యత్‌కు ద్రోహం చేయడమే అన్నారు. తాలిబాన్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని రషీద్ ఖాన్ కోరారు. ప్రతి ఒక్కరికీ విద్యపై హక్కు ఉందని ఇస్లాం బోధిస్తుందని గుర్తుచేశారు. బాలికల విద్యాహక్కును పునరుద్ధరించాలని కోరారు.
ఇస్లామిక్ బోధనలో విద్య ప్రధాన స్థానాన్ని కలిగి ఉందని రషీద్ ఖాన్ పేర్కొన్నారు. ఇది పురుషులకు, మహిళలకు ఇద్దరికి జ్ఞాన సాధనే అని తెలిపారు. తాలిబాన్ నిర్ణయం.. భవిష్యత్‌ను మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇస్లామిక్ చట్టానికి కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల విద్యపై కత్తి పడింది. నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీ కోర్సులలో చేరే మహిళలపై కొత్త నిషేధాన్ని విధించాలని తాలిబాన్ యోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. తాలిబాన్ ప్రభుత్వం నిషేధాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ఆయా సంస్థల్లో అమలులోకి రావడానికి ముందు తుది పరీక్షలను నిర్వహించడానికి 10 రోజుల సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. తాలిబాన్ నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ కూడా ఖండించింది.