NTV Telugu Site icon

Covid 19: చైనాలో కరోనా విజృంభణ.. ప్రజలు ఇళ్లకే పరిమితం..!

Covid 19

Covid 19

కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. కొంతకాలంగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంతో.. అక్కడి ప్రభుత్వం జీకో కొవిడ్ ఆంక్షల్ని అమలు చేసింది. అయితే, ఆ ఆంక్షలు కఠినంగా ఉండటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. వాటిని సడలించాల్సిందిగా కోరుతూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మరో దారి లేక.. జీరో కొవిడ్ ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది. ఈ దెబ్బకు అక్కడ మళ్లీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే.. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నాటికి చైనాలో కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు హెచ్చరించాయి.. మరోవైపు.. మళ్లీ కరోనా విలయతాండవం చేస్తుండడంతో.. డ్రాగన్‌ కంట్రీ మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.. కేసులు భారీగా వెలుగు చూస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారట… దీంతో రోడ్లన్నీ బోసిగా దర్శనమిస్తున్నాయి. నిన్న ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ దాదాపుగా ఖాళీగా కనిపించడం కరోనా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మీడియా నివేదికల ప్రకారం, బీజింగ్‌లో కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది, చైనా రెండు వారాలుగా వైరస్ తో మరణించినవారి సంఖ్య పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.

Read Also: Pilot Rohit Reddy: నేడు ఈడీ విచారణకు రోహిత్‌ రెడ్డి.. 10 అంశాల వివరాలతో రావాలని ఆదేశం

బీజింగ్ శ్మశానవాటికలోని సిబ్బంది తాజాగా కనీసం 30 మంది కోవిడ్ బాధితుల మృతదేహాలను దహనం చేశారని ఫైనాన్షియల్ టైమ్స్‌తో చెప్పారు, చనిపోయిన వారిలో ఒకరి బంధువు వారి కుటుంబ సభ్యుడు వైరస్ బారిన పడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. బీజింగ్‌లోని అంత్యక్రియల గృహాలు కిక్కిరిసిపోయాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంటుంది.. కోవిడ్ మరణాలు దహన సంస్కారాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఓ ఉద్యోగి వెల్లడించారు.. కోవిడ్ -19 కారణంగా ఇటీవలి రోజుల్లో రాజధాని బీజింగ్‌లో ఇద్దరు మాజీ చైనా రాష్ట్ర మీడియా జర్నలిస్టులు మరణించారని స్థానిక మీడియా ఈ వారం నివేదించింది. మాజీ పీపుల్స్ డైలీ రిపోర్టర్ యాంగ్ లియాంగ్వా డిసెంబర్ 15న 74 ఏళ్ల వయసులో మరణించగా, చైనా యూత్ డైలీ ఎడిటర్‌గా ఉన్న జౌ జిచున్ డిసెంబర్ 8న 77 ఏళ్ల వయసులో మరణించినట్లు ఆర్థిక పత్రిక కైక్సిన్ తెలిపింది. అయితే, చైనా జాతీయ ఆరోగ్య అథారిటీ అధికారికంగా ఎటువంటి కోవిడ్ మరణాలను నివేదించలేదు.

2019 చివరలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి చైనా కేవలం 5,235 కోవిడ్ మరణాలను నివేదించింది, వుహాన్‌లో మొదటి కేసులు నమోదయ్యాయి. చైనాలో కోవిడ్ మరణాలు ఇతర దేశాల కంటే వైరస్‌ను మెరుగ్గా నిర్వహించాయనే కథనాలు వచ్చాయి.. చైనాలో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే చైనా నూతన సంవత్సరం (లూనార్ న్యూ ఇయర్) తర్వాత దేశంలో రెండో వేవ్ వచ్చే అవకాశం ఉందని చైనా చీఫ్ ఎపిడమాలజిస్ట్ వూ జూన్‌యు అంచనా వేశారు. ప్రజాగ్రహం కారణంగా చైనా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత అధికారికంగా మరణాలను నివేదించలేదు. అయితే, శ్మశాన వాటికలు మాత్రం బిజీగా ఉండడాన్ని బట్టి మరణాలు భారీగా సంభవిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే, కరోనా ఆంక్షలు సడలించిన తర్వాత.. క్రమంగా కేసులు పెరగడం కలకలం రేపుతోంది.. పాజిటివ్ కేసులు పెరుగుతూ పోవడం.. మరణాలు కూడా పెరగడంతో.. ప్రజల్లో మళ్లీ ఆందోళనమొదలైంది.